Chandrayaan 3 Update: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక దశ ముగిసింది. భారత శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపై విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. అయితే జాబిల్లిపై ప్రస్తుతం సెకనుకు సెంటీమీటర్ వేగంతో ల్యాండర్ విక్రమ్ కదులుతోంది. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన వెంటనే ల్యాండర్ విక్రమ్ పని మొదలుపెట్టేసింది. అక్కడి నుంచి నాలుగు ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. బెంగళూరు కేంద్రానికి, చంద్రయాన్ 3 ల్యాండర్ కు కనెక్షన్ కుదిరింది. హారిజాంటర్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలు ఇవి అని ఇస్రో పేర్కొంది.


40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరపడిపోయాయి. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో సౌత్ పోల్ ను తాకిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది.






The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి


https://news.abplive.com/chandrayaan-moon-landing/amp/amp 


ల్యాండింగ్ ఇమేజర్ కెమెరా నుంచి చంద్రుడిపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ అయిన తరువాత తీసిన ఫొటో ఇది. ఈ ఫొటోను ఇస్రో షేర్ చేసింది. ఇది చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్‌లో ల్యాండర్ తీసిన ఫొటో. ఈ ఫొటో గమనిస్తే మీకు ల్యాండర్ ఒక కాలు నీడ కనిపిస్తుంది అని ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రుని ఉపరితలంపై చదునైన ప్రాంతాన్ని చంద్రయాన్-3 ఎంచుకుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రశంసల వెల్లువ..
చంద్రయాన్ 3 ప్రయోగంతో ఇస్రో చరిత్ర తిరగరాసింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలవడపై  ఇస్రో శాస్ర్తవేత్తలను కృషిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. సినీ, రాజకీయ, వ్యాపార ఇతర రంగాల ప్రముఖులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత్ సాధించిన విజయంపై అభినందనల వెల్లువ కొనసాగుతోంది. 


చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ దేశ చరిత్రలో కీలకమైన మైలురాయిగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఇలాంటి క్షణాల్ని చూసినందుకు, ఆస్వాదిస్తున్నందుకు తన జీవితం ధన్యమైందన్నారు. ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని  జొహెన్నెస్‌బర్గ్‌ లో ఉన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ఆయన అక్కడి నుంచే వర్చువల్‌గా చంద్రయాన్‌ - 3 ల్యాండింగ్‌ ప్రక్రియను వీక్షించారు. ల్యాండర్ విక్రమ్ మాడ్యుల్ విజయవంతగా జాబిల్లి ఉపరితలంపై దిగగానే సంబరాలు మొదలయ్యాయి. వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలను అంతర్జాతీయ వేదికగా ప్రధాని మోదీ అభినందించారు. భవిష్యత్తులో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తుందని, ఈ ఘనతకు సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.