Modi On Chandrayan : చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్ర్తవేత్తలను కృషిని కొనియాడారు. దీంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని మోదీ అన్నారు. చంద్రయాన్ సూపర్ సక్సెస్ మరీ కీలకమైన మైలురాయిగా పేర్కొన్న ప్రధాని తన జీవితం ధన్యమైందని అన్నారు.  జొహెన్నెస్‌బర్గ్‌ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా చంద్రయాన్‌ - 3 ల్యాండింగ్‌ ప్రక్రియను వీక్షించారు. విక్రమ్‌ ల్యాండర్‌ సుమారు 40 రోజుల పాటు ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. చంద్రయాన్‌-3 విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జొహెన్నెస్‌బర్గ్‌ నుంచే దేశ ప్రజలనుద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు.         





 
 
స్పేస్ సైన్స్ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవంపై భారత్ విజయవంతంగా తన విక్రమ్ రోవర్ ను చేర్చటంలో సఫలం కావటం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్ విజయం దేశం గర్వించే మహత్తరమైన క్షణాలుగా ప్రధాని అభివర్ణించారు. దీంతో ఇండియా ప్రపంచపటంలో కొత్త చరిత్రకు నాంది పలికిందని అన్నారు. ఇది అమృతకాలంలో నెలకొన్న తొలి ఘన విజయం ఇదని ప్రధాని మోదీ వెల్లడించారు. తాను దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైనప్పటికీ తన మనసంతా చంద్రయాన్-3పైనే ఉందని చెప్పారు. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం. అద్భుత విజయం కోసం 140కోట్ల మంది ఎదురు చూశారన్నారు.  చంద్రయాన్‌-3 బృందం, ఇస్రో శాస్త్ర వేత్తలకు అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశా’నని  అని మోదీ  భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.                              


చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 ) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడింది. దీంతో అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ , చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటివల చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు ప్రయత్నించిన రష్యా లూనా-25 ఈ నెల 19న జాబిల్లిపై క్రాష్‌ ల్యాండ్‌ అయింది. కానీ ఇస్రో మాత్రం అనుకున్నది సాధించింది.                                 


చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమవ్వడంతో బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు ఉప్పొంగిపోయారు. వర్చువల్‌గా బెంగళూరు కేంద్రంలోని శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఉత్సాహపరిచారు. ల్యాండింగ్ విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులపై ప్రశంజల జల్లు కురిపించారు.