సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం (ఆగస్టు 23) మధ్యాహ్నమే కేసీఆర్ మెదక్ కు చేరుకున్నారు. ముందుగా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ఆఫీసులో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజలు చేశారు. ఈ మంత్రోచ్ఛారణలు జరిపి, అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ యాదవ్, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
టాప్‌లో తెలంగాణ రాష్ట్రమే - కేసీఆర్
ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని అన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఏ రాష్ట్రమూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా బాగా లేవని అన్నారు. ఉమ్మడి పాలనలో మంజీరా నది దుమ్ముకొట్టుకుపోయిందని విమర్శించారు.
తెలంగాణ వారికి పరిపాలన చేతకాదంటూ ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డిలాగా కొందరు ఎగతాళి చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్తగా ప్రారంభించుకుంటున్న ఆఫీసులే మన దగ్గర డెవలప్మెంట్ కు నిదర్శనమని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. అధికారుల కృషి వల్లే ఇది సాధ్యం అయిందని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో కూడా రాష్ట్రం నంబర్ వన్ గా ఉందని అన్నారు. వచ్చే రోజుల్లో పింఛను పెంచుతామని, దివ్యాంగుల పింఛన్ ను రూ.4,016 కు పెంచామని వెల్లడించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది పింఛను దారులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
63 ఎకరాల సువిశాల స్థలంలో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించారు. జీ ప్లస్ 3 పద్ధతిలో 38.50 కోట్ల వ్యయం ఈ నిర్మాణానికి అయింది. ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే పరేడ్ గ్రౌండ్ ఉంటుంది. ఆ పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉంటుంది.
ఒక ఎకరా స్థలంలో రూ.60 లక్షల ఖర్చుతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును నిర్మించారు. జిల్లా నేతలకు సమావేశాలు ఏర్పాటు చేసుకొనేందుకు ఇది వేదిక కానుంది. కార్యాలయంలో మీటింగ్ పెట్టుకోవడానికి అనువుగా ప్రత్యేకంగా పెద్ద హాల్ నిర్మాణం చేపట్టారు.
దివ్యాంగులకు రూ. 3116 నుంచి రూ. 4116 కు పెంచిన పింఛన్‌ను, టెకేదార్ బీడీ కులవృత్తుల కార్మికులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు.
భారీ బహిరంగసభ
నేడు భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. ఇదే సభలో దివ్యాంగుల పెన్షన్ పెంపుపై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జాబితాను కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభలో సీఎం ఏం మాట్లాడనున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక పెడింగ్ లో ఉన్న నర్సాపూర్ టికెట్ పై ఈ సభలో క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.