Group One News : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ వన్ పరీక్షలకు ఎంపికయ్యాడు. అయితే ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువగా చూపేందుకు తప్పుడు పత్రాలను తెర మీదకు తెచ్చాడు. చివరికి దొరికిపోయాడు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 పరీక్షల్లో ఎంపికయ్యి, ఉద్యోగం కోసం ఎత్తు ఎక్కువగా ఉన్నట్లు తప్పుడు పత్రాలను సమర్పించిన ఎ. లోకేష్ అనే యువకుడి పై విజయవాడ సూర్యారావు పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు నిర్దారించారు. సాంకేతికంగా ఆధారాలను సేకరించిన పోలీసుల లోకేష్ తప్పుడు పత్రాలతో ఉద్యోగం సంపాదించాలని చేసిన ప్రయత్నంగా గుర్తించారు.
ఎత్తువ ఎక్కువ చూపిస్తే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టిన ఎ.లోకేష్
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం గుండవనపల్లి గ్రామా నికి చెందిన ఎ. లోకేష్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆద్వర్యంలో గ్రూప్-1 పరీక్షలకు ఎంపికయ్యాడు. వివిధ కేటగిరిల కింద ఉన్న మొత్తం 111 పోస్టుల కోసం కమిషన్ నోటి ఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎంపికైన అభ్య ర్థులకు ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో లోకేష్ ఎంపిక కాగా, అభ్యర్థులను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం లోకేష్ 167.7 సెంటీమీటర్లు ఎత్తు ఉన్నట్లు నిర్ధారిస్తూ పత్రాలను జారీ చేశారు. ప్రభుత్వాసుపత్రి వర్గాలు ఇచ్చిన ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను లోకేష్ అధికారులకు సమర్పించారు. అయితే లోకేష్ శరీరతత్వానికి, పత్రాల్లో ఉన్న రికార్డులకు మద్య తేడా ఉందని అధికారులకు అనుమానం కలిగింది.
నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉన్న ఎ.లోకేష్
లోకేష్ సమర్పించిన సర్టిఫికెట్ లో 167.7 సెం.మీ ఎత్తు ఉన్నట్లు ఉండటంతో.. అధికారులకు అనుమానం వచ్చింది. అంత ఎత్తు ఉండడని అధికారులు సందేహం కలిగింది. ఎదో తేడా ఉండటంతో వేర్వేరు వైద్య అధికారుల నుంచి సెకండ్ ఒపీనియన్ కోసం పంపించారు. రెండో సారి వచ్చిన ధ్రువీకరణ పత్రంలో లోకేష్ ఎత్తు 167 సెం.మీ.గా తేలింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థి 167.6 సెం.మీ. ఎత్తు ఉండాలి. నియమిత ఎత్తు కన్నా తక్కువ ఉండటంతో.. తప్పుడు ధ్రువపత్రం సమరించి ఉండొచ్చని ఏపీపీఎస్సీ అధికారులు నిర్ధారించుకున్నారు. కేసును విజయవాడ పోలీసు అధికారులకు రిఫర్ చేశారు. తూని కలు కొలతల శాఖ అధికారుల సమక్షంలో మరో సారి లోకేష్ ఎత్తు కు సంబంధించిన కొలతలు తీశారు. ఎత్తు తక్కువగా ఉన్నట్లు తేలిపోయింది. తప్పుడు ధ్రువపత్రం సమ ర్పించినట్లు నిర్ధారించి, సూర్యారావుపేట పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోకేష్ పై ఆంధ్రప్రదేశ్ మాల్ ప్రాక్టీసెస్ నిరోధక చట్టం 1997, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎత్తు సర్టిఫై చేసిన డాక్టర్లపై గురి
నిందితుడు లోకేష్ తానే స్వయంగా తప్పుడు పత్రాలను సృష్టించి వాటిని అధికారులకు సమర్పించాడా, లేదంటే వైద్య సిబ్బందే ప్రలోభాలకు లొంగి తప్పుడు ధ్రువపత్రాలను ఇచ్చారా... అనే దాని పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు లోకేష్ చిక్కితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ధ్రువపత్రంపై వైద్యుడి పేరు, సంతకం తదితర విషయాల పై ఆరా తీస్తున్నారు. ఈ మోసంలో వైద్యుల పాత్ర ఉంటే.. వారి పైనా కేసు నమోదు చేస్తామని ఏసీపీ రవికాంత్ వెల్లడించారు.