Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండర్ ను, ప్రజ్ఞాన్ రోవర్ ను సంప్రదించడానికి ప్రయత్నాలు చేశామని, అవి యాక్టివేట్ స్థితిని తెలుసుకునేందుకు ఇంకా ఎలాంటి సంకేతాలు అందలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెలిపింది. ల్యాండర్ ను, రోవర్ ను ఈ నెల ప్రారంభంలో స్లీప్ మోడ్ లో ఉంచింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రాత్రి సమయంలో పూర్తయి, పగటి సమయం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి మొదలైంది. సెప్టెంబర్ 22వ తేదీన విక్రమ్ ల్యాండర్‌ను, ప్రజ్ఞాన్ రోవర్‌ను రీయాక్టివేట్ చేస్తామని ఇస్రో తొలుత ప్రకటించి.. పలు కారణాల వల్ల దానిని శనివారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 మిషన్ గురించి తాజాగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా ల్యాండర్, రోవర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన డేటాతో తాను సంతృప్తిగా ఉన్నట్లు ఎస్ సోమనాథ్ తెలిపారు. ఎన్డీటీవీతో మాట్లాడిన సోమనాథ్.. చంద్రయాన్-3లో అమర్చిన అన్ని శాస్త్రీయ పరికారల నుంచి వచ్చిన డేటాతో ఇస్రో శాస్త్రవేత్తల బృందం సంతృప్తిగా ఉందని చెప్పుకొచ్చారు. రోవర్ పంపించిన డేటాను విశ్లేషణ కొనసాగుతోందని, దీనికి చాలా సంవత్సరాలు పట్టవచ్చని తెలిపారు.


చంద్రయాన్-2 ఎంతో నేర్పించింది


చంద్రయాన్-2 ఒక పెద్ద గుణపాఠమని ఇస్రో చీఫ్ అన్నారు. ఈ మిషన్ లో ఎక్కడ, ఎలాంటి తప్పు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చంద్రయాన్-2 ఎంతో సహాయపడిందని చెప్పారు. చంద్రయాన్-2కి ముందు భూమిపై పూర్తి స్థాయి పరీక్షలు చేయలేమని ఆయన చెప్పారు. 


చంద్రుడు, అంగారక గ్రహాలపై ఆవాసాలు అవసరం


'అంతిమంగా చంద్రునిపై ఎందుకు వెళ్తాం. అది మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో చూడటం కోసం. చంద్రుపైకి వెళ్లి తిరిగి రాగలగాలి. అక్కడ దిగడమే కాదు.. మనం ఇంటికి తిరిగొచ్చి మళ్లీ వెళ్లగలగాలి. ఎంతో మెటీరియల్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడి చేరాలి. చంద్రయాన్-3 విజయం ద్వారా.. ఈ లక్ష్యాలను చేరే అవకాశాలను కనుగొనే వీలు ఉంటుంది. మానవాళి భూమిని దాటి ప్రయాణించాలంటే.. చంద్రుడు, అంగారక గ్రహం సహా ఎక్సోప్లానెట్లపై ఆవాసాలు సృష్టించుకోవడం చాలా అవసరం. భారతీయులు తప్పకుండా అలాంటి ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలి' అని సోమనాథ్ అన్నారు.


చంద్రయాన్-3కి సంబంధించిన అప్‌డేట్ ఏంటంటే?


విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను సంప్రదించే ప్రయత్నాలు కొనసాగుతాయని ట్విట్టర్ వేదికగా ఇస్రో తెలిపింది. చంద్రునిపై పగటి సమయం మొదలైనందు వల్ల.. ల్యాండర్, రోవర్ లతో తిరిగి కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సోమనాథ్ తెలిపారు. ఒకవేళ అవి రీయాక్టివేట్ అయితే.. మరిన్ని ప్రయోగాలు చేయడం ద్వారా మరింత డేటాను పొందవచ్చని అన్నారు.


ల్యాండర్, రోవర్ లు చంద్రుని దక్షిణ ధ్రువంలో 16 రోజుల పాటు స్లీప్ మోడ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన అక్కడ పగలు మొదలైంది. ఈ సమయంలో ల్యాండర్ ను, రోవర్ ను రీయాక్టివేట్ చేయాలని ఇస్రో ప్రణాళిక వేసింది. బుధవారం శివశక్తి పాయింట్ వద్ద సూర్యకాంతి రాకతో వాటిని తిరిగి కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం చంద్రయాన్-3 దిగిన ప్రాంతంలో సూర్యోదయం జరిగిందని, బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని ఇస్రో తెలిపింది. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లతో మళ్లీ కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ల్యాండర్, రోవర్ పనిచేయడానికి అవసరమైన వేడిని అందజేసే సూర్యోదయం అవసరమని ఇస్రో తెలిపింది.