Humsafar Express: గుజరాత్ లోని వల్సాద్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరుచ్చిరాపల్లి నుంచి శ్రీగంగానగర్ కు వెళ్తోంది. వల్సాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే.. రైలులోని జనరేటర్ కోచ్ లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మంటలతో దట్టంగా పొగలు వ్యాపించాయి. మంటలను, దట్టంగా కమ్ముకున్న పొగలను గుర్తించిన సిబ్బంది హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటనే నిలిపి వేశారు. వెంటనే ప్రయాణికులను రైలు నుంచి కిందకు దించేశారు.
రైలు నంబర్ 22498 తిరుచ్చిరాపల్లి జంక్షన్ నుంచి శ్రీ గంగానగర్ జంక్షన్ వరకు వల్సాద్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పవర్ కార్ / బ్రేక్ వ్యాన్ కోచ్ లో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. పొగలను గమనించి వెంటనే రైలు నిలిపి వేశామని, ఆ వెంటనే పక్కనే ఉన్న కోచ్ లోని ప్రయాణికులు అందరినీ ముందు జాగ్రత్తగా కిందకు దించినట్లు పశ్చిమ రైల్వే సీపీఆర్వో సుమిత్ ఠాకూర్ తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే పవర్ కోచ్ లో మంటలు చెలరేగాయని పోలీసు సూపరింటెండెంట్ కరణ్ రాజ్ వాఘేలా తెలిపారు. ఈ మంటలు బి1 కోచ్ కు వ్యాపించాయని, వెంటనే స్పందించి మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గురైన కోచ్ ను హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ నుంచి వేరు చేసిన తర్వాత హమ్‌సఫ్ ఎక్స్‌ప్రెస్ తిరిగి ప్రారంభం అయినట్లు సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణాపాయం జరగలేదని చెప్పారు.