Khalistani Terrorist: ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్- కెనడా దేశాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతోంది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్లకు పాత్ర ఉందంటూ చేసిన కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం కూడా దీటుగా స్పందిస్తోంది. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చిన భారత్.. ఇప్పుడు ఉగ్రవాది అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ బతికున్నప్పుడు పన్నిన కుట్రలు తాలుకూ వివరాలు బయటపెడుతోంది. ఈ మేరకు గతంలో నిజ్జర్ భారత దేశంలో దాడులకు సిక్కులకు ఇచ్చిన ఆదేశాల సమాచారాన్ని తాజాగా నిఘా వర్గాలు వెల్లడించాయి. 


హర్దీప్ సింగ్ నిజ్జర్ 1980ల నుంచే నేరాలు చేస్తున్నాడని, చిన్నప్పటి నుంచే స్థానిక గూండాలతో సంబంధాలు కలిగి ఉన్నాడని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. 1996లో నకిలీ పాస్‌పోర్టుతో నిజ్జర్ కెనడాకు పారిపోయి, మొదట్లో అక్కడ ట్రక్కు డ్రైవర్ గా పని చేసినట్లు వెల్లడించాయి. ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం పాకిస్థాన్ కు కూడా నిజ్జర్ వెళ్లి వచ్చినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కెనడాలో ఉంటూ.. పంజాబ్ లో హత్యలు, దాడులకు పథకం పన్నినట్లు నిఘా వర్గాల నివేదికలు చెబుతున్నాయి. 


2014లో హర్యానా సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కేంద్రంలో ఉగ్రదాడికి హర్దీప్ సింగ్ నిజ్జర్ ప్లాన్ చేశాడని, అయితే భారత్ కు చేరుకోలేకపోవడంతో అది జరగలేదని నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్ కు చెందిన శివసేన నాయకుడు మాజీ డీజీపీ మహ్మద్ ఇజార్ ఆలమ్ ను లక్ష్యంగా చేసుకుని తన మాడ్యూల్ ను ఆదేశించాడని నిఘా వర్గాల నివేదికలు చెబుతున్నాయి. 


పంజాబ్ జలంధర్ లోని భర్‌సింగ్‌పురా గ్రామానికి చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్.. గుర్నేక్ సింగ్ అలియాస్ నేకా ద్వారా గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ప్రారంభించాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. 1980ల నుంచి 1990ల వరకు నిజ్జర్.. ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ (KCF) మిలిటెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నాడని, ఆ తర్వాత 2012 నుంచి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (KTF) చీఫ్ జగ్తార్ సింగ్ తారాతో సన్నిహిత సంబంధాలు నెరిపాడని నిఘా వర్గాలు తెలిపాయి. అనేక ఉగ్రవాద కేసుల్లో నిజ్జర్ పేరు బయటకు రావడంతో.. 1996లో కెనడాకు పారిపోయినట్లు వెల్లడించాయి. 


పంజాబ్ లో ఉగ్రవాద దాడిని అమలు చేయడానికి జగ్తార్ సింగ్ తారతో కలిసి నిజ్జర్ ప్లాన్ చేశాడు. కెనడాలో మన్‌దీప్ సింగ్ ధాలివాల్, సర్బ్‌జిత్ సింగ్, అనుప్వీర్ సింగ్, దర్శన్ సింగ్ అలియాస్ ఫౌజీతో ముఠాగా నిజ్జర్ ఏర్పడ్డాడు. వారంతా బ్రిటిష్ కొలంబియాలో ఆయుధ శిక్షణ పొందారని నిఘా వర్గాల నివేదికలు వెల్లడించారు.


పంజాబ్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి నిజ్జర్.. పంజాబ్ కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దాలాతో కలిసి మోగా నుంచి పనిచేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 2020లో యాంటీ పాంథిక్ యాక్టివిటీస్ ఆరోపణలు ఎదుర్కొన్న తండ్రీకొడుకులు మనోహర్ లాల్ అరోరా, జతీందర్‌బీర్‌ సింగ్ లను చంపడానికి అర్ష్‌దీప్‌కి అప్పగించాడు. ఈ దాడిలో మనోహర్‌లాల్‌ ను అతని నివాసంలోనే కాల్చి చంపారు. కానీ అతని కుమారుడు తప్పించుకున్నాడు. ఈ హత్యకు నిజ్జర్.. కెనడా నుంచి డబ్బు పంపినట్లు నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి.