Chandrayaan 3: చంద్రునిపై రాత్రివేళ దగ్గర పడుతున్న కొద్ది భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 రీయాక్టివేషన్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. సెప్టెంబరు 30న చంద్రుడిపై రాత్రి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అంతరిక్ష నౌకతో ఇస్రో మళ్లీ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన అంతరిక్ష నౌక సెప్టెంబర్ 2 నుంచి స్లీప్ మోడ్‌లో ఉంది. 14 రోజుల తరువాత చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం అయింది. అప్పటి నుంచి స్లీప్ మోడ్‌లో ఉన్న రోవర్ ప్రజ్ఞాన్, లాండర్ విక్రమ్‌తో శాస్త్రవేత్తలు అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. శివశక్తి పాయింట్ వద్ద సూర్యకాంతి రాకతో వాటిని తిరిగి కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేసింది. అయితే అవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు.
శివ్‌శక్రి పాయింట్‌పై సూర్యకాంతి తిరిగి వచ్చినప్పటి నుండి ఇస్రో ల్యాండర్-రోవర్ ద్వయంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది, కానీ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. గతంలో ఇస్రో శాస్త్రవేత్త మాట్లాడుతూ.. చంద్రుడిపై రాత్రి పూట ప్రతికూల పరిస్థితులు ఉంటాయని అన్నారు. చంద్రయాన్ చంద్రుడిపై పరిస్థితులను తట్టుకుని ఒక రాత్రి బ్రతికితే, చరిత్ర సృష్టిస్తుందని, మరెన్నో రాత్రులను తట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ అది జరగలేదు. చంద్రుని రాత్రి సమీపిస్తున్న కొద్దీ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ యాక్టివేట్ అవుతాయనే ఆశలు మసకబారుతున్నాయి.
చంద్రునిపై రాత్రి సమయం అత్యంత కఠినంగా ఉంటుంది. దాదాపు 14 భూమి రోజుల పాటు చంద్రుడిపై చీకటి కొనసాగుతుంది. ఆ సమయంలో అక్కడ తీవ్రమైన చలి ఉంటుంది. చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. ఎంతటి సాంకేతిక పరికరమైనా పనికిరానిదిగా మారుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌కు ఇది ప్రతికూలంగా మారుతుంది. ఎందుకంటే ఆ రెండు సూర్యరస్మి ఆధారంగా పని చేస్తాయి.
చంద్రుడిపై రాత్రి సమయంలో అక్కడి శీతల వాతావరణం ప్రభావానికి గురయ్యాయి. చంద్రుడిపై సూర్యోదయం అయినా తిరిగి యాక్టివేట్ అవలేదు. వాటితో కమ్యునికేషన్ ఏర్పాటు చేసేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇన్ని ప్రయత్నాలు చేసినా అయితే రోవర్ ప్రజ్ఞాన్, లాండర్ విక్రమ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమయం గడిచేకొద్ది అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు.
జూలై 14, 2023న ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ ఇప్పటికే గణనీయమైన మైలురాళ్లను సాధించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నాయి. చంద్రుడిపై సౌత్ పోల్ పై తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్... చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్, ఖనిజాలను కనుగొంది. ప్రజ్ఞాన్ రోవర్ లోని లిబ్స్ గా పిలుచుకునే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్ స్ట్రుమెంట్ సహాయంతో చంద్రుడిపై ఉన్న ఎలిమెంట్స్ ను కన్ఫర్మ్ చేసింది ఇస్రో.
అన్నింటికంటే ముఖ్యంగా చంద్రుడి ఉపరితలంపై దక్షిణధృవంపై సల్ఫర్ నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. అంత కంటే అద్భుతమైన విషయం ఏంటంటే చంద్రుడిపై ఆక్సిజన్ నిల్వలను కూడా గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. అల్యూమినియం, కాల్షియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, సిలికాన్, టైటానియం నిల్వలను ధృవీకరించింది. హైడ్రోజన్‌ను సైతం వెతికే పనిలో ఉన్నామని ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దానికి సంబంధించిన రెస్పాన్స్ వేల్ లెంత్ గ్రాఫ్ ను విడుదల చేసింది.