Maneka Gandhi: 



రూ.100 కోట్ల పరువు నష్టం దావా 


ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ మనేకా గాంధీకి ఆ సంస్థ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు ఆమెకి నోటీసులు కూడా పంపింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధ కలిగించాయని వెల్లడించింది. ఎలాంటి ఆధారాల్లేకుండానే ఆమె అసత్య ఆరోపణలు చేశారని మండి పడింది. అందుకే పరువు నష్టం దావా వేస్తున్నట్టు వివరించింది. 


"ఇస్కాన్‌పై అసత్య ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ మనేకా గాంధీకి రూ.100 పరువు నష్టం దావా వేశాం. ఆమెకి నోటీసులు పంపించాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌ సంస్థలో ఎంతో మంది భక్తులు, మద్దతుదారులున్నారు. వాళ్లంతా ఈ వ్యాఖ్యలతో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల మనోభావాలు దెబ్బ తినేలా మనేకా గాంధీ మాట్లాడారు. ఇవి మా ప్రతిష్ఠకి భంగం కలిగించేలా ఉన్నాయి. ఇస్కాన్‌పై ఈ విద్వేష ప్రచారాన్ని మేం ఏ మాత్రం సహించం. న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాం"


- రాధారమణ్ దాస్‌, వైస్‌ ప్రెసిడెంట్, కోల్‌కత్తా ఇస్కాన్ 






ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇస్కాన్‌ ప్రతినిధులు మండి పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గోమాతలను రక్షించేందుకు తాము ఎన్నో చర్యలు చేపడుతున్నామని తేల్చి చెప్పారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవే అని స్పష్టం చేశారు. 


బీజేపీ ఎంపీ మనేకా గాంధీ ఇస్కాన్‌ (ISKCON)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థ ప్రజల్ని మోసం చేస్తోందని, గోశాలల్లోని ఆవులను కసాయి వాళ్లకి అమ్మేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేశాయి ఈ కామెంట్స్. ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు సంపాదిస్తోందని, భూములనూ కొల్లగొడుతోందని ఆరోపించారు మనేకా గాంధీ. 


"ఇస్కాన్ సంస్థ దేశ ప్రజల్ని మోసం చేస్తోంది. గోశాలలను ఏర్పాటు చేస్తోంది. వాటి నుంచి బాగా సంపాదిస్తోంది. ప్రభుత్వం నుంచీ పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుంటోంది. భూమలనూ సంపాదించుకుంటోంది. ఆ తరవాత ఆ గోశాలల్లోని ఆవులను కసాయి వాళ్లకి అమ్మేస్తోంది. ఈ మధ్యే ఏపీలోని అనంతపూర్ గోశాలకు వెళ్లాను. అక్కడ ఒక్క ఆవు కూడా ఆరోగ్యంగా లేదు. ఒక్క దూడ కూడా కనిపించలేదు. అంటే ఆవులను కసాయి వాళ్లకు అమ్ముతున్నారనేగా అర్థం. ఇస్కాన్ అమ్మినంతగా దేశంలో మరెవరూ ఆవుల్ని ఇలా అమ్ముకోరు. కానీ మళ్లీ వాళ్లే రోడ్లపైకి వచ్చి హరేరామ హరేకృష్ణ అని భజనలు చేస్తారు"


- మనేకా గాంధీ, బీజేపీ ఎంపీ


Also Read: 2024లో జమిలి ఎన్నికలు లేనట్టే! నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్?