Cauvery Water Dispute: 



44 ఫ్లైట్స్ క్యాన్సిల్..


కావేరి జలాల వివాదం తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చు పెట్టింది. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కర్ణాటకలో ఇవాళ పలు సంస్థలు బంద్‌కి పిలుపునిచ్చాయి. ఆటోలు, ట్యాక్సీలు నడవడం లేదు. KSRTC బస్‌లు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విమాన ప్రయాణికులకూ ఈ సమస్యలు తప్పడంలేదు. బంద్ కారణంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 44 ఫ్లైట్స్‌ రద్దయ్యాయి. కన్నడ సంస్థ ఒక్కుట పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా ఫ్లైట్ సర్వీస్‌లను రద్దుచేశారు.





అయితే...ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మాత్రం అందుకు వేరే కారణం చెబుతోంది. ఆపరేషనల్ రీజన్స్‌ వల్ల విమానాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ప్రయాణికులకు ఇదే సమాచారం అందించింది. కేవలం బంద్ కారణంగానే ఫ్లైట్‌లు రద్దయ్యాయని కొందరు వాదిస్తున్నారు. బంద్ వల్ల ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోలేని వాళ్లు చాలా మంది ఉన్నారని, వాళ్లంతా టికెట్‌లు క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ వద్ద కూడా ఆందోళనకారులు అలజడి సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమిళనాడుకి కావేరి జలాలు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఎయిర్‌పోర్ట్ వద్ద నిరసనలు చేపట్టిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురూ ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ కోసం టికెట్‌లు కూడా బుక్ చేసుకున్నారు. ఆసాకుతో లోపలికి వచ్చి ఆందోళన చేశారు. ఈ బంద్ కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.