Rs 2000 Notes: మన దేశంలో హైయస్ట్ డినామినేషన్ కరెన్సీ అయిన రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి గడువు అతి సమీపంలోకి వచ్చింది, సెప్టెంబరు 30, 2023 వరకే ఛాన్స్ ఉంది. టెక్నికల్‌గా, ఈ రోజు (సెప్టెంబరు 29, 2023) బ్యాంకులకు పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు కాబట్టి, రూ.2000 నోట్లను రిటర్న్ చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలుంది.
చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93% తిరిగి బ్యాంకులకు వచ్చాయని, రూ.24,000 కోట్ల విలువైన పింక్ నోట్లు ఇప్పటికీ ప్రజల చేతుల్లోనే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నెల ప్రారంభంలో చెప్పింది. ఒకవేళ, ఎవరైనా సెప్టెంబర్ 30 గడువును మిస్ అయితే, అతని దగ్గరున్న రూ.2000 నోట్ల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.
రూ.2000 నోట్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థల్లోకి తిరిగి తీసుకొచ్చేందుకు, 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఏ బ్యాంక్ బ్రాంచ్‌కైనా వెళ్లవచ్చని ఆర్‌బీఐ ప్రజలకు సూచించింది. 2000 నోట్లను ఖాతాల్లో జమ/మార్పిడి చేసుకునే ఫెసిలిటీ సెప్టెంబర్ 30 వరకు అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. ప్రజలు, రూ.20,000 వేల విలువైన రూ.2000 నోట్లను ఒకేసారి మార్చుకోవచ్చు.
RBIకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో (ROలు) కూడా ఎక్సేంజ్ ఫెసిలిటీ సెప్టెంబర్ 30, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ, నోట్లను ఎక్సేంజ్ మాత్రమే చేస్తారు, డిపాజిట్ తీసుకోరు.
సెప్టెంబర్ 30 గడువు దాటితే రూ.2000 నోట్లు ఏమవుతాయి?
మొదటిది, సెప్టెంబర్ 30, 2023 తర్వాత కూడా రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి. గడువు ముగిసిన తర్వాత రూ. 2000 నోట్లు చెల్లవని RBI ప్రకటించలేదు. కాబట్టి, గడువు దాటిన తర్వాత కూడా అవి లీగల్ టెండర్లే. అయితే, సెంట్రల్ బ్యాంక్ చర్యలను బట్టి చూస్తే, రూ.2000 నోట్లను చెలామణీ నుంచి పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
సెప్టెంబర్ 30, 2023 తర్వాత, ప్రజలు తమ దగ్గరున్న రూ. 2000 నోట్లను ఉపయోగించలేరంటూ చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అవన్నీ ఊహాగానాలే. రూ.2000 నోట్లపై ఆర్‌బీఐ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఒకవేళ, సెప్టెంబర్ 30 గడువును ఎవరైనా మిస్ అయితే, బ్యాంకుల్లో వాటిని జమ చేయలేకపోవచ్చు. అయితే, మార్చుకోవడానికి మరో అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇవ్వొచ్చు. ఈసారి బ్యాంకుల్లో మార్పిడి కాకుండా, RBI ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సి రావచ్చు. రిపోర్ట్స్ ప్రకారం, తమ దగ్గర ఉన్న రూ. 2000 నోట్లను సెప్టెంబర్ 30, 2023 లోగా ఎందుకు డిపాజిట్ చేయలేదు లేదా మార్చుకోలేదు అనే కారణాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది.
రూ.2,000 నోట్ల గురించి ఆర్‌బీఐ గవర్నర్ ఏం చెప్పారు?
ఈ ఏడాది మే నెలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో, "సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుందనే దానిపై నేను ఊహించి, సమాధానం ఇవ్వలేను. రూ. 2,000 నోట్ల లీగర్ టెండర్ స్టేటస్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే కొనసాగుతుందని మేము ఎప్పుడూ చెప్పలేదు" అన్నారు. కాబట్టి, గడువు దాటిన తర్వాత కూడా అవి లీగల్ టెండర్లుగానే ఉండొచ్చు.
అలాగే, "గడువులోగా ఎన్ని పింక్ నోట్లు తిరిగి వస్తాయోనని సెంట్రల్ బ్యాంక్ ఎదురు చూస్తోందని, గడువు రోజున ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం" అని దాస్ చెప్పారు.
సెప్టెంబరు 1 నాటికి, చలామణీలో ఉన్న 93% రూ.2000 నోట్లు బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయి కాబట్టి, గడువు పొడిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే, 2000 రూపాయల నోట్లను చట్టబద్ధ కరెన్సీగా తొలగించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని కూడా రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తోంది.
ఆర్‌బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్ నవంబర్ 2016లో తీసుకొచ్చారు. అంతకుముందే, చలామణిలో ఉన్న మొత్తం రూ.500 & రూ.1000 నోట్ల చట్టబద్ధతను రద్దు చేశారు. దీంతో, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన నోట్ల కొరతను తీర్చడానికి రూ.2000 నోట్ల డినామినేషన్‌ను ఆర్‌బీఐ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఇతర డినామినేషన్ల నోట్లు కూడా తగినన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరింది. దీంతో, 2018-19లో 2000 రూపాయల నోట్ల ముద్రణను RBI నిలిపేసింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial