Sonia Gandhi: 



ప్రహ్లాద్ జోషి సమాధానం..


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో చెప్పాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కనీసం ప్రతిపక్షాలకు ఓ మాట కూడా చెప్పకుండా ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడమేంటని ప్రశ్నించారు. ఈ లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బహుశా సోనియా గాంధీకి పార్లమెంటరీ వ్యవహారాల గురించి తెలిసి ఉండకపోవచ్చని ప్రహ్లాద్ జోషి బదులుగా లేఖ రాశారు. సమావేశాలు ప్రారంభమైన తరవాత కానీ...ప్రతిపక్షాలకు అజెండా ఏంటో చెప్పమని స్పష్టం చేశారు. పార్లమెంట్ వ్యవహారాలను అనుసరిస్తూనే ఈ సమావేశాలకు పిలుపునిచ్చినట్టు తేల్చి చెప్పారు ప్రహ్లాద్ జోషి. 


"పార్లమెంట్ వ్యవహారాలకు అనుగుణంగానే ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చాం. కానీ మీరు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. సమావేశాలు జరిగే ముందు ప్రతిపక్షాలకు అజెండా ఏంటో ప్రభుత్వం చెప్పదు. రాష్ట్రపతి ఈ సమావేశాలకు పిలుపునిచ్చిన తరవాత, సెషన్స్ మొదలయ్యే ముందు ఆల్ పార్టీస్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడే పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ జరుగుతుంది"


- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి 


ఇదీ జరిగింది..


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ నెల 18-22 వరకూ కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏ చర్చలు జరుగుతాయో చెప్పాలని ప్రధానికి రాసిన లేఖలో అడిగారు సోనియా. ఇతర పార్టీలతో ఏ మాత్రం చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. అసలు ఎందుకు ఈ సమావేశాలు పెడుతున్నారో స్పష్టత లేదని అన్నారు. ఇదే లేఖలో మొత్తం 9 అంశాలను ప్రస్తావించారు సోనియా. దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం,నిరుద్యోగం సమస్యలపై మాట్లాడేందుకు సమయం కేటాయించాలని అడిగారు.


"సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారు. కానీ మిగతా పార్టీలకు ఓ మాట కూడా చెప్పకుండానే వీటిని ఏర్పాటు చేశారు. మాలో ఎవరికి కూడా ఈ సమావేశాల అజెండా ఏంటో స్పష్టత లేదు. కీలక అంశాలపై చర్చించేందుకు మాకు సమయం కేటాయిస్తారనే ఆశిస్తున్నాం"


- సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత


లేఖలోని కొన్ని అంశాలు..


1. దేశంలో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలి. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగతం, చిన్న మధ్య తరహా పరిశ్రమలపై ఒత్తిడి పెరగడం లాంటి అంశాలపై చర్చించేందుకు అవకాశమివ్వాలి. 


2. రైతులకు కేంద్రం ఇచ్చిన హామీలు, కనీస మద్దతు ధర విషయంలో రైతు సంఘాలకు ఇచ్చిన హామీలపై చర్చ  జరగాలి. 


3. అదానీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు జేపీసీ కమిటీని నియమించాలి. 


4. మణిపూర్‌ అల్లర్లపై చర్చించడంతో పాటు, ఆ సమస్యకు పరిష్కారం చూపించడం, శాంతియుత వాతావరణం నెలకొల్పడంపై చర్చ జరగాలి. 


5. హరియాణా సహా పలు రాష్ట్రాల్లో అశాంతిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాధానం చెప్పాలి. 


6. లద్దాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. 


Also Read: భారత్ అన్ని దేశాలనూ కలిపే వారధి లాంటిది, ABP న్యూస్‌తో G20 చీఫ్ కో ఆర్డినేటర్ శ్రింగ్లా