G20 Summit 2023: భారతదేశం సాధించిన అతి పెద్ద డిజిటల్‌ విజయం UPI ఆధారిత చెల్లింపులు. పానీపూరీ బండి నుంచి ఫైర్‌ స్టార్‌ హోటల్‌ వరకు, ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్‌ అలవాటయ్యాయి. ఈ ఘన విజయాన్ని G20 వేదికగా ప్రపంచానికి చెప్పబోతోంది భారత్‌.


భారతదేశం మొట్టమొదటిసారిగా G20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 9-10 తేదీల్లో జరిగే శిఖరాగ్ర సదస్సులో, అమెరికా, చైనా సహా ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక శక్తులు దిల్లీ వేదికగా భారత్‌లో కలవబోతున్నాయి. ఈ అవకాశాన్ని అన్ని మార్గాల్లోనూ ఉపయోగించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. సమ్మిట్‌కు వచ్చే అందరికీ, మన దేశంలోని డిజిటల్ కెపాసిటీస్‌పై అవగాహన కల్పించడం అందులో ఒకటి.


UPI ద్వారా డబ్బు పంపిణీ
ఆధార్ (Aadhar), డిజీలాకర్ ‍‌(Digilocker), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటి భారతదేశం సాధించిన డిజిటల్‌ అచీవ్‌మెంట్స్‌ గురించి G20 ప్రతినిధులకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ఉబలాటపడుతోంది. ET రిపోర్ట్‌ ప్రకారం, సదస్సు సందర్భంగా ప్రతినిధులందరికీ UPI ద్వారా డబ్బు పంపాలని సెంట్రల్‌ గవర్నమెంట్‌ యోచిస్తోంది.         


1000 మందికి పైగా ప్రతినిధులు 
రెండు రోజుల పాటు జరిగే జీ20 సదస్సులో 1000 మందికి పైగా డెలిగేట్స్‌ పాల్గొనే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. వాళ్లందరి కోసం కేంద్ర ప్రభుత్వం వాలెట్లను తయారు చేస్తోంది. సమ్మిట్‌ జరుగుతున్న సమయంలో, యూపీఐ ద్వారా ప్రతి ఒక్కరి వాలెట్‌కు వెయ్యి రూపాయలు బదిలీ చేస్తారు. శిఖరాగ్ర వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ డబ్బును డెలిగేట్స్‌ ఉపయోగించుకోవచ్చు.         


ప్రభుత్వ ప్రణాళిక ఇది
ప్రస్తుతం, భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్‌ ఎంత సులువుగా మారాయో ఇతర దేశాల నేతలు, అధికారులకు తెలియజేయాలన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం. భారతదేశం ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను ఎలా చేస్తోంది, ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో డిజిటల్ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్ ఎలా ఉపయోగపడింది అన్న విషయాలను జీ20 దేశాల ప్రతినిధులకు తెలిసేలా చేస్తుంది.        


భారతదేశంలో వాడుకలోకి వచ్చిన ఇతర డిజిటల్ కెపాసిటీస్‌ను కూడా G20 సమ్మిట్‌లో ప్రదర్శిస్తారు. UPIతో పాటు, ఆధార్, డిజిలాకర్ సేవల గురించి కూడా డెలిగేట్స్‌కు పరిచయం చేస్తారు. అంతేకాదు, G20 సమ్మిట్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన భాషిణి (Bhashini), ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (Open Network for Digital Commerce - ONDC), జాతీయ టెలీమెడిసిన్‌ సేవ అయిన ఈ-సంజీవని (eSanjeevani)ని కూడా ప్రతినిధుల ముందుంచే ప్లాన్ చేస్తున్నారు. భాషిణి అనేది రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ టూల్. వివిధ దేశాల నుంచి హాజరైన డెలిగేట్స్‌, అన్ని కార్యక్రమాలను వారి సొంత భాషలో తక్షణం వినడానికి ఇది సాయపడుతుంది.      


మరో ఆసక్తికర కథనం: డెబిట్‌ కార్డ్‌ను మర్చిపోండి, UPIతో ATM నుంచి డబ్బులు డ్రా చేయండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial