UPI ATM: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడానికి డెబిట్‌ కార్డ్‌/ఏటీఎం కార్డ్‌ తీసుకెళ్లాల్సిన అవసరం లేని రోజులు వచ్చాయి. UPI (Unified Payments Interface) ద్వారా డబ్బులు ఎలా పే చేస్తున్నామో, అదే విధంగా ఏటీఎం నుంచి కూడా డ్రా చేసే ఫెసిలిటీ వచ్చింది.


జపాన్‌కు చెందిన హిటాచీ అనుబంధ సంస్థ 'హిటాచీ పేమెంట్ సర్వీసెస్' (Hitachi Payment Services), యూపీఐ-ఏటీఎంను (UPI-ATM‌) ప్రారంభించింది. హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం (Hitachi Money Spot UPI ATM) అని దీనికి పేరు పెట్టింది. మీ డెబిట్ కార్డ్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించకుండానే ఈ మెషీన్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. 


ఈ నెల 5న, ముంబైలో జరిగిన 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023'లో హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను లాంచ్‌ చేశారు. ఈ UPI ATMని దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే, డబ్బులు డ్రా చేయడానికి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ATMలకు తీసుకువెళ్లాల్సిన రోజులు పోతాయి. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అప్లికేషన్స్‌ ఉపయోగించి, మీ బ్యాంక్ అకౌంట్‌ నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి UPI-ATM అనుమతిస్తుంది.


UPI-ATM నుంచి డబ్బును ఎలా డ్రా చేయాలి?
UPI-ATM ఉపయోగించడం చాలా సులభం, సురక్షితం, శ్రమ లేని పని అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ క్యాష్ బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO సుమిల్ వికామ్సే చెబుతున్నారు. హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను ఉపయోగించి డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలని అనేదానిపై స్టెప్‌ బై స్టెబ్‌ గైడ్‌ను ఆయన షేర్ చేశారు. 


1) హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంకు వెళ్లిన తర్వాత, ముందుగా, ATM నుంచి విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంచుకోవాలి.


2) ఎంచుకున్న మొత్తానికి సంబంధించిన QR కోడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


3) మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న ఏదైనా UPI యాప్‌ను (గూగుల్‌ పే, ఫోన్‌పే వంటివి) ఉపయోగించి ఆ QR కోడ్‌ను స్కాన్ చేయాలి.


4) ఆ లావాదేవీని ధృవీకరించడానికి మీ మొబైల్‌లో UPI పిన్‌ ఎంటర్‌ చేయాలి.


6) యూపీఐతో లింక్‌ అయిన ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్స్‌ ఉంటే, ఏ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలో కూడా మీరు నిర్ణయించుకోవచ్చు.


5) ఆథరైజేషన్‌ పూర్తయిన తర్వాత ATM నుంచి నగదు బయటకు వస్తుంది.


UPI-ATMను ఎవరు ఉపయోగించవచ్చు?
UPI అప్లికేషన్ ఉన్న ఎవరైనా UPI-ATMలను ఉపయోగించవచ్చు. లావాదేవీలు చేయడానికి కస్టమర్‌కు చెందిన Android లేదా iOS ఫోన్‌లో UPI యాప్‌ ఉంటే చాలు.


UPI ATM - కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా మధ్య తేడాలేంటి?
ప్రస్తుతం, చాలా బ్యాంకులు కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా (cardless cash withdrawals) సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దీనికి భిన్నంగా UPI-ATM పని చేస్తుంది. కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా అనేది మొబైల్, OTPపై ఆధారపడి ఉంటుంది. UPI ATM అనేది QR ఆధారిత UPI క్యాష్‌ విత్‌డ్రాపై ఆధారపడి ఉంటుంది.


చాలా ప్రయోజనాలు
UPI-ATM వల్ల, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను మోసగాళ్లు 'స్కిమ్మింగ్' చేసే రిస్క్‌ పూర్తిగా తగ్గుతుంది. నెలలో ఇన్ని సార్లే కార్డును ఉపయోగించాలి, ఇంత మొత్తంలోనే డబ్బులు తీయాలంటూ బ్యాంకులు ఇబ్బందులు పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, UPI-ATM ఆ ఇబ్బందులను తొలగిస్తుంది. సులభమైన విత్‌డ్రా పద్ధతితో, నిరక్ష్యరాస్యులను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ విశ్వసిస్తోంది.


UPI-ATMను దేశంలో విస్తరించే పని కొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: హెచ్చరిక - డైజీన్‌ జెల్‌ను డస్ట్‌బిన్‌లో వేసేయండి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial