Digene Gel: కడుపులో మంట (ఎసిడిటీ), గ్యాస్‌తో ఇబ్బంది పడేవాళ్ల ఇళ్లలో డైజీన్‌ జెల్‌ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది తాగితే ఉపశమనం లభిస్తుంది. యాంటాసిడ్ సిరప్ డైజీన్‌ జెల్‌ను ప్రముఖ ఫార్మా కంపెనీ అబాట్ ఇండియా (Abbott India Ltd) ఉత్పత్తి చేస్తోంది.


అయితే, ఈ జెల్‌కు సంబంధించి ఇప్పుడు బయటికొచ్చిన వార్తతో దేశంలో కలకలం రేగింది. డైజీన్‌ జెల్‌ను ఉపయోగించడం మానేయాలని ప్రజలు, హెల్త్‌కేర్‌ ఎక్స్‌పర్ట్‌లకు 'డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా' (DCGI) సూచించింది. డైజీన్‌ జెల్ రీకాల్ కోసం (వెనక్కు తీసుకోవాలని) హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు, రెగ్యులేటరీ అథారిటీలకు DCGI నుంచి సూచనలు అందాయి.


డైజీన్ వినియోగంపై పబ్లిక్‌ నోటీస్‌
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్స్ కంట్రోలర్లు మార్కెట్‌లో డైజీన్‌ జెల్‌ మూవ్‌మెంట్‌, అమ్మకాలు, పంపిణీ, నిల్వలపై ఖచ్చితమైన నిఘా ఉంచాలని, ఈ ఉత్పత్తి మార్కెట్లో ఉంటే నమూనాలు తీసుకోవాలని, డ్రగ్స్ & కాస్మెటిక్స్ యాక్ట్‌ రూల్స్‌ ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా DCGI నిర్దేశించింది.


DGCA, తన వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్‌ను జారీ చేసింది. ఆ నోటీస్‌లో చెప్పిన ప్రకారం... "వివాదాస్పద ఉత్పత్తి (డైజీన్‌ జెల్) సురక్షితం కాదు, దానిని వినియోగిస్తే ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చు. డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ రోగులకు దీనిని సూచించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డైజీన్‌ జెల్ వాడకుండా రోగులకు అవగాహన కల్పించాలి. ఏదైనా ప్రతికూల ప్రభావం లేదా మెడికల్‌ రియాక్షన్‌ జరిగితే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఈ ఉత్పత్తికి సంబంధించి ఏదైనా అనుమానాస్పద కేసు వస్తే మాకు రిపోర్ట్ చేయండి". 


DGCAకు అందిన కంప్లైంట్‌ ఇది
డైజీన్ జెల్ పుదీనా ఫ్లేవర్‌లో ఒక బాటిల్ సాధారణ రుచి (తీపి), లేత గులాబీ రంగులో ఉందని, అయితే అదే బ్యాచ్‌కి చెందిన మరొక సీసాలో మందు తెలుపు రంగులో, చేదు రుచితో, ఘాటైన వాసనతో ఉందని ఆరోపిస్తూ ఆగస్టు 9న DCGIకి కంప్లైంట్‌ అందింది. ఆ ఫిర్యాదుపై విచారణ చేసిన DCGI, తాజాగా అడ్వైజరీని జారీ చేసింది.


అబాట్ ఇండియా ఏం చెప్పింది?
కస్టమర్ల నుంచి కంప్లైంట్స్‌ వచ్చిన తర్వాత, అబాట్ ఇండియా ఒక బ్యాచ్ డైజీన్‌ మింట్ ఫ్లేవర్, నాలుగు బ్యాచ్‌ల ఆరెంజ్ ఫ్లేవర్‌ను రీకాల్ చేసింది. ఆ తర్వాత ఒక వారంలోనే, గోవా ఫెసిలిటీలో తయారు చేసిన డైజీన్‌ సిరప్‌ పుదీనా, ఆరెంజ్‌, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ ఫ్లేవర్ల బ్యాచ్‌లను కూడా రీకాల్ చేసింది.


ఆగస్టు 11న DCGIకి అబాట్ ఇండియా ఒక లేఖ పంపింది. కంప్లైంట్స్‌ వచ్చిన డైజీన్ జెల్ యాంటాసిడ్ ఔషధాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వెనక్కు తీసుకున్నామని, గోవా ఫెసిలిటీలో తయారైన డైజీన్ జెల్‌కు చెందిన అన్ని రకాల ఫ్లేవర్లను నిలిపివేసినట్లు తెలిపింది. దీనిని ఉపయోగించి వాళ్ల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలపై ఇంత వరకు ఎలాంటి నివేదికలు లేవని వివరించింది.


డైజీన్‌ టాబ్లెట్‌లు, స్టిక్ ప్యాక్‌లు వంటి ఇతర రూపాల్లో ఉన్న ఔషధంతో ఎలాంటి ఇబ్బంది లేదని, ఇతర ప్రాంతాల్లోని (గోవా మినహా) ఫెసిలిటీల్లో ఉత్పత్తి చేసిన డైజీన్ జెల్‌ కూడా ప్రభావితం కాలేదని, మార్కెట్‌లో ప్రస్తుతమున్న డిమాండ్‌ను తీర్చడానికి తగిన పరిమాణంలో జెల్‌ అందుబాటులో ఉందని కూడా తెలిపింది. 


అబాట్ ఇండియా రెండో ప్రొడక్షన్‌ ఫెసిలిటీ బడ్డీలో ఉంది.


మరో ఆసక్తికర కథనం: ముడి చమురు ధరల పెరుగుదలను కామ్‌గా క్యాష్‌ చేసుకోగల 5 స్టాక్స్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial