Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత బోనుకు చిక్కింది. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం 7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. తిరుమల మెట్ల మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని తెలిపారు. రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కినట్లు చెప్పుకొచ్చారు. 


రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు పట్టుకున్నామని.. భక్తుల క్షేమం, భద్రత, సౌలభ్యం కల్పించడానికి టీటీడీ పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. అటవీశాఖ అధికారుల సహకారంతో వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని అన్నారు. గుంపులు గుంపులుగా ప్రయాణించమని భక్తులకి నిరంతరం విజ్ఞప్తి చేయడంతోపాటుగా వారి వెంట భద్రత సిబ్బందిని పంపుతున్నామని ఆయన చెప్పారు. భక్తులకు ఎలాంటి  ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల్లో ఐదు చిరుతలను పట్టుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి చిన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను నడక మార్గం గుండా అనుమతించడం లేదన్నారు. నిన్నటి నుంచి అలిపిరి నడక మార్గంలో ఊత కర్రలను ఇస్తున్నామని వెల్లడించారు. కర్రలపై ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, కర్రలు ఇచ్చి మా పని అయిపోయిందని తాము ఎప్పుడు అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. కేవలం భక్తులకు ఆత్మస్థైర్యం అందించేందుకే కర్రలు అందిస్తున్నామన్నారు. 200 మంది అటవీశాఖ సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారని, యాత్రికుల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, విమర్శలకు, బూతులకు జడిసి భద్రతా కార్యక్రమాలను ఆపేది లేదంటూ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. 


తాజాగా చిక్కిన చిరుతను క్వారంటైన్ కు తరలిస్తున్నట్లు తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు. దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు శాంపుల్స్ ని పంపించినట్లు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత ఏ చిరుత దాడి చేసిందో నిర్ధారణకు వస్తుందన్నారు. నడకదారికి నలువైపులా వన్యమృగాల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు నడకమార్గాల్లో నిరంతరాయంగా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు.


ఐదు చిరుతలు పట్టుకున్నారిలా!


24 జూన్‌ 2023 మొదటి చిరుతను టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది కలిసి బంధించారు. ఇకపై అంతా ప్రశాంతమే అనుకున్నారంతా కానీ ఆగస్టుల అసలు కథ మొదలైంది. చిరుతలో వైల్డ్ యాంగిల్‌ను ప్రపంచం చూసింది. 


చిన్నారి తినేసిన చిరుత వచ్చే మార్గాలను అన్వేషించారు అధికారులు. అది తిరిగే మార్గాల్లో ప్రత్యేక ట్రాప్‌లు ఏర్పాటు చేశారు కెమెరాలు ఫిట్ చేశారు. ఇలా అష్టదిగ్బంధం చేసిన తర్వాత మరో చిరుత బోనులో పడింది. ఆగష్టు 14 రెండో చిరుత అధికారుల ట్రాప్‌కు చిక్కింది. అక్కడకు మూడు రోజుల తర్వాత మూడో చిరుతను ఆగష్టు 17న పట్టుకున్నారు. 


ఇక చిరుతలు లేవేమో అనుకున్నారు కానీ భక్తుల్లో ఎక్కడో చోట భయం కలిగింది. కొందరు సీనియర్ అధికారులు మాత్రం ఇంకా చిరుతలు ఉండనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వారి అనుమానమే నిజమైంది. మరోసారి చిరుత జాడను పసిగట్టారు అధికారులు. 
దీంతో మరోసారి ట్రాప్‌ ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే ఎర కోసం వచ్చిన చిరుత ఆగష్టు 28న బోనులో చిక్కింది. అంతా ఊపిరి పీల్చుకున్న టైంలో వారం రోజుల తర్వాత ఇవాళ సెప్టెంబర్‌ 6వ మరో చిరుత చిక్కింది. ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకా ఉన్నాయా అన్న అనుమానం భక్తుల్లో పోవడం లేదు.