తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న టీటీడీ అటవీశాఖ అధికారులు ఇప్పుడు ఐదో చిరుతను బంధించారు. నరసింహస్వామి ఏడో మైలు రాయి వద్ద నాలుగు రోజుల క్రితం ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలను గుర్తించిన అధికారులు అక్కడ ఎరను పెట్టి బోనును ఏర్పాటు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అందులో చిరుత పడినట్లు గుర్తించారు. దీన్ని కూడా  మగ చిరుతగానే గుర్తించిన అధికారులు జూకు తరలించి శాంపుల్స్ తీసి తిరుపతి ఐసర్ కు పంపించనున్నారు.


చిరుతను బంధించిన విషయాన్ని తెలుసుకున్న టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ఏడో మైలు రాయి వద్దకు చేరుకున్నారు. బోనులో బంధీగా పడి ఉన్న చిరుతను చూశారు. అక్కడే అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


గత మూడు నెలల నుంచి తిరుమల నడకమార్గంలో వన్యమృగాల సంచారం ఎక్కువైంది. చిరుతలు, ఎలుగుబంట్లు కాలిబాటలోకి రావడంతో భక్తుల్లో కూడా ఆందోళన పెరిగింది. దీనిపై టీటీడీ ఎన్ని విధాలుగా భక్తుల్లో ధైర్యం కల్పిస్తున్నా భయం ఎక్కడో చోట ఉండనే ఉంది. 
భయాన్ని రెట్టింపు చేస్తూ జులైలో ఓ బాలుడిని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది చిరుత. ఆగస్టులో ఓ చిన్నారిని లాక్కెళ్లి ప్రాణాలు సైతం తీసేసింది. ఈ రెండు ఘటనలు టీటీడీ చరిత్రలో మాయనిమచ్చలా మిగిలిపోనున్నాయి. అందుకే ఆపరేషన్ చిరుతను చేపట్టారు. 


ఆపరేషన్ చిరుత చేపట్టిన తర్వాత ఒకట్రెండు చిరుతలు తిరుగుతున్నాయని వాటిని పట్టుకుంటే సమస్యకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావించారు. జూన్‌ 24 మొదటి చిరుతను పట్టుకున్నారు. ఇక అంతా ప్రశాంతమే అనుకున్నారు. ఆగష్టులో మరో చిరుత భక్తులకు కనిపించింది. దీంతో మరోసారి ట్రాప్ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేశారు. ఇంతలో చిన్నారిని ఈ వన్యప్రాణి బలితీసుకోవడంతో చర్యలు వేగవంతం చేశారు. 


చిన్నారి తినేసిన చిరుత వచ్చే మార్గాలను అన్వేషించారు అధికారులు. అది తిరిగే మార్గాల్లో ప్రత్యేక ట్రాప్‌లు ఏర్పాటు చేశారు కెమెరాలు ఫిట్ చేశారు. ఇలా అష్టదిగ్బంధం చేసిన తర్వాత మరో చిరుత బోనులో పడింది. ఆగష్టు 14 రెండో చిరుత అధికారుల ట్రాప్‌కు చిక్కింది. అక్కడకు మూడు రోజుల తర్వాత మూడో చిరుతను ఆగష్టు 17న పట్టుకున్నారు. 


ఇక చిరుతలు లేవేమో అనుకున్నారు కానీ భక్తుల్లో ఎక్కడో చోట భయం కలిగింది. కొందరు సీనియర్ అధికారులు మాత్రం ఇంకా చిరుతలు ఉండనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వారి అనుమానమే నిజమైంది. మరోసారి చిరుత జాడను పసిగట్టారు అధికారులు. 


దీంతో మరోసారి ట్రాప్‌ ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే ఎర కోసం వచ్చిన చిరుత ఆగష్టు 28న బోనులో చిక్కింది. అంతా ఊపిరి పీల్చుకున్న టైంలో వారం రోజుల తర్వాత ఇవాళ సెప్టెంబర్‌ 6వ మరో చిరుత చిక్కింది.