TTD Distributes Sticks At Alipiri: 
అలిపిరి కాలిబాట మార్గంలో వన్యమృగాలు సంచారం కొనసాగుతుంది. దాంతో భక్తులలో మనోధైర్యం నింపేందుకు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడికి ఊతకర్రను అందించేందుకు టిటిడి నిర్ణయం‌ తీసుకుంది. ఆ నిర్ణయాన్ని నేటి నుంచి టిటిడి అమల్లోకి తీసుకొచ్చింది. దాదాపు పది వేల ఊతకర్రలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులకు అందిస్తున్న కర్రలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఊతకర్రలకు కోసం ఎంత ఖర్చు చేసిందో వివరాలపై ఓ లుక్కేయండి.


తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం దేశ విదేశాల నుంచి సైతం భక్తులు వస్తూ ఉంటారు. కొందరు రోడ్డు మార్గం, మరికొందరు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం గుండా గోవింద నామస్మరణ చేస్తూ నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటారు. జూన్ 22వ తారీఖున కౌశిక్ అనే ఐదేళ్ల బాలుడుపై అలిపిరి నడక మార్గంలో గల ఏడవ మైలు వద్ద చిరుత పులి దాడి చేసి గాయపరిచింది. ఆగస్టు 11వ తారీఖున అదే ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై దాడి చేసిన చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చంపేసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన టిటిడి మరియు అటవీ శాఖ అధికారులు భక్తుల భద్రత దృష్ట్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


ఏడవ మైలు నుండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు హై అలెర్ట్ జోన్ గా ప్రకటిస్తూ ఆ ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వన్యమృగాల కదిలికలను గుర్తించి మూడు చిరుతలను బంధించి వాటిని ఎస్వీ జూపార్క్ తరలించారు. ఇంకా చిరుత ఆపరేషన్ కొనసాగుతోంది. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు మనోధైర్యం నింపేందుకు టీటీడీ ఊతకర్రలను భక్తులకు అందించేందుకు చర్యలు చేపట్టింది. కాలిబాట మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడు చేతికి ఓ ఊత కర్ర అందించే సిబ్బందిని కేటాయించింది. ఈ ఊతకర్రలను శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి పది వేల కర్రలను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం 45 వేల రూపాయల ఖర్చుతో పదివేల కర్రలను కొనుగోలు చేసినట్లు టీటీడీ తెలిపింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దాటిన తర్వాత భక్తుల నుంచి ఈ కర్రలను తిరిగి తీసుకొని వాటిని మళ్లీ అలిపిరికి చేర్చి, భక్తులకు అందించే విధంగా చర్యలు చేపట్టింది.


ఊతకర్రలపై దుష్ ప్రచారంపై టిటిడి ఛైర్మన్ భూమన..
అలిపిరి న‌డ‌కమార్గంలో క్రూర‌మృగాల సంచారంతో భద్రతా చర్యలలో భాగంగా భక్తుల్లో ఆత్మస్థైర్యం నింప‌డానికి చేతిక‌ర్ర‌లు అంద‌జేస్తున్నామ‌ని టీటీడీ చైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తెలిపారు. చేతిక‌ర్ర‌లతో భ‌క్తులు క్రూర‌మృగాల‌తో పోరాడ‌తార‌ని కాద‌ని, చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా వెనకాడుతుందని శాస్త్రీయ పరిశీలన ద్వారా రుజువైందని చెప్పారు. వేల సంవత్సరాల నుంచి గ్రామాల్లో ప్ర‌జ‌లు పొలాలకు, అడవులకు వెళ్లేటప్పుడు చేతికర్రలను ఆస‌రాగా తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. యాత్రికులకు చేతి కర్రను ఇచ్చి టీటీడీ బాధ్య‌త తీరిన‌ట్టు భావించ‌డం లేద‌ని, భ‌క్తుల‌కు గుంపులుగా పంపుతున్నామ‌ని, వీరికి సెక్యూరిటీ గార్డు భ‌ద్ర‌త‌గా ఉంటార‌ని, అక్కడక్కడ పోలీసు సిబ్బంది కూడా రక్షణగా ఉంటారని తెలియజేశారు. 


టీటీడీ చేపట్టిన చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటుచేసి ఇప్పటివరకు నాలుగు చిరుతలను బంధించామ‌ని తెలియజేశారు.. కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.. చేతి క‌ర్ర‌ల‌ను భ‌క్తుల‌కు ఉచితంగా అందిస్తామ‌ని, వీటిని అలిపిరిలో అంద‌జేసి శ్రీ న‌ర‌సింహ‌ స్వామి వారి ఆల‌యం వ‌ద్ద తిరిగి తీసుకుంటామ‌ని చెప్పారు..