TTD News: అలిపిరి కాలిబాట భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేతి కర్రలు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల చిరుతల సంచారం పెరగడంతో టీటీడీ భక్తులకు కర్రలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు బుధవారం కాలినడకన వెళ్లే భక్తులకు కర్రల పంపిణీ ప్రారంభించారు. కర్రలు ఇచ్చి చేతులు దులుపుకోమమని, భక్తుల భద్రతకు చర్యలు తీసుకుంటాం అని ఆలయ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. కావాలనుకున్న వారికే కర్రలు ఇస్తామని చెప్పారు. భక్తుల భద్రత కోసం టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోందని భక్తుల్లో ఆత్మవిశ్వాసం నింపడం కోసమే కర్రలు ఇస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం మాత్రమే చేతి కర్రలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. నడిచి వెళ్లే యాత్రికులకు టీటీడీ ఎప్పుడూ అండగానే ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. నరసింహ స్వామి ఆలయం దగ్గర భక్తుల నుంచి కర్రలు తీసుకుంటామని భూమన చెప్పారు.  


అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్ళే భక్తులకు విధించిన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అలిపిరి‌ నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ళ లోపు చిన్నారులకి అలిపిరి నడక మార్గంలో అనుమతిని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా అలిపిరి నడక మార్గంలో హై అలర్ట్ ప్రకటించిన ప్రాంతంలో సాయంత్రం ఆరు గంటల నుండి 100 మందిని కలిపి గుంపులు గుంపులుగా ఏడోవ మైలు నుండి శ్రీ నృశింహ స్వామి వారి ఆలయం వరకు పంపనున్నారు. ఈ భక్తుల సమూహానికి ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ పోలీసు సిబ్బంది భధ్రత కల్పిస్తారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి భక్తులు కచ్చితంగా టీటీడీ విధించిన ఆంక్షలు పాటించాలని హెచ్చరించారు.


అలాగే నడక మార్గంలో వచ్చే తల్లిదండ్రులకు పోలీసులు పలు సూచనలు చేయడంతో పాటుగా, ఏడోవ మైలు వద్ద 15 సంవత్సరాల లోపు చిన్నారులకి పోలీసులు ట్యాగ్స్ ను వేస్తున్నారు. ట్యాగ్స్ చిన్నారుల చేతికి ఉండడం కారణంగా తప్పి పోయిన చిన్నారులను గుర్తించేందుకు సులభంగా ఉంటుందని, దీని ద్వారా పిల్లలు త్వరగా తల్లిదండ్రుల వద్దకు చేరే అవకాశం‌ ఉండడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ట్యాగ్స్ పై చిన్నారుల తల్లిదండ్రుల పేర్లు, ఫోన్స్ నెంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్ ను రాసి చిన్నారులకు ట్యాగ్స్ ను వేస్తున్నారు. అంతే కాకుండా ఈ గుంపులకు ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ పోలీసు సిబ్బంది భధ్రత కల్పిస్తున్నారు. 



అలాగే మంగళ వారం రోజు టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. గోవింద కోటి రాసిన పాతికేళ్ల లోపు యువత కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రామకోటి తరహాలోనే గోవింద కోటి రాసేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. యువతలో భక్తి భావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు 20 పేజీలతో భగవద్గీత పంపిణీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. 33 కోట్ల రూపాయలో వడమాలపేటలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 300 కోట్ల రూపాయలతో వసతి భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. రెండు కోట్ల రూపాయల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయాన్ని పునర్నిర్మిస్తామన్నారు. టీటీడీ పోులో 413 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.