తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తమకు తోచినంత ఉండీలో వేస్తుంటారు.. మరి కొందరు దాతలు విరాళాలు అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి స్వామివారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు. టీటీడీ చరిత్రలో అధిక మొత్తంలో ఒకేరోజు ఇంత భారీగా విరాళం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందింది.. అష్టదళపాదపద్మారాధన సేవకు ఉపయోగించే 108 బంగారు పుష్పాలను లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ విరాళంగా ఇచ్చారు.. బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పాల్గొన్న కిరణ్, దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డికి కోటి యాభై లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను అందజేశారు.. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందించగా, టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ను పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారిని దర్శించుకోలేకపోయిన వాళ్లు తిరునగరికి పయనమవుతున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనాలను అనుమతిస్తుండడం, కాలినడకన వచ్చే వారి సంఖ్య కూడా పెరగడంతో.. సప్తగిరులు కిక్కిరిసిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి గంటల పాటు భక్తులు వేచిఉండాల్సి వస్తోంది.
TTD Special Darshan.......
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 20వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్ కోటాను కూడా సెప్టెంబరు 21 న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.
నవంబర్ నెలలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల లభ్యతను బట్టి ఈ టిక్కెట్లు మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన జారీ చేస్తారని టీటీడీ ప్రకటించింది.
నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవం జరిగే తేదీలు అంటే అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించరు.భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.