ఎర్రచందనం (Red Sandal) పెంపకం, ఎగుమతుల(Exports)పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పరిమితంగా పండే ఎర్రచందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించింది. 2004 నుంచి భారత్‌లో లభ్యమయ్యే ఎర్రచందనం రివ్యూ ఆఫ్‌ సిగ్నిఫికెంట్‌ ట్రేడ్‌ ప్రాసెస్‌ కింద ఉందని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌(Bupendra Yadav ) తెలిపారు. రివ్యూ ఆఫ్‌ సిగ్నిఫికెంట్‌ ట్రేడ్‌ ప్రాసెస్‌ నిబంధన నుంచి తొలగించడం వల్ల రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్‌ 6 నుంచి 10 వరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పీషీస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఫ్లోరా అండ్‌ ఫౌనా స్థాయీసంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రచందనంపై ఉన్న ఆంక్షలు తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటి నుంచి రైతులు ఎర్రచందనాన్ని పండించి, ఎగుమతి చేయడానికి వీలుపడుతుందని తెలిపారు. 


ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో ఎర్రచంద్రనం విస్తరించి ఉంది. ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవి. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది. ప్రధానంగా, శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. చైనా, జపాన్, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. 


రెడ్ సాండర్స్ లేదా ప్టెరోకార్పస్ శాంటాలినస్ అని కూడా పిలువబడే ఎర్ర చందనం సాగు పట్ల రైతులు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏ పంటను పండించినా కూడా అందనంత లాభాలు ఈ పంట సాగులో ఉండటమే. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఈ ఎర్రచందనం సాగుద్వారా కోట్ల రుపాయల ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఎర్రచందనం అనేది భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒక విలువైన చెట్టు జాతి. ప్రపంచంలో ఈ జాతి మరెక్కడా పెరగదు. ముఖ్యంగా ఎర్ర చందనం కలప మృదువుగా ఉంటూ అందమైన ఫర్నీచర్లు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి, అలంకార వస్తువులను రూపొందించడానికి ఈ చెక్క ఎంతో అనుకూలం.  అందువల్లే ఈ ఎర్రచందనం చెట్టు నుంచి లభించే కలపకు అంతర్జాతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. అయితే ఎర్రచందనం సాగు చేయడం అనేది సులభమైన ప్రక్రియ కాదని గుర్తుంచుకోవాలి. ఎర్ర చందనం సాగుకు అనువైన భూమిని ఎంచుకున్న తర్వాత చేయాల్సిన పని అధికారుల నుంచి అనుమతులు పొందడం చాలా కీలకం. చాలా విలువైన ఈ చెట్లను పెంచడం, విక్రయించడం కోసం వ్యవసాయ, అటవీశాఖ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భూ వినియోగ క్లియరెన్స్ సర్టిఫికెట్స్‌ పొందడం కూడా ఈ అనుమతుల్లో భాగమే అని గుర్తుంచుకోవాలి.