Small Saving Schemes New Rules: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్‌తో సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించింది. PTI రిపోర్ట్‌ను బట్టి, నవంబర్ 9 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కొత్త రూల్స్‌ తీసుకొచ్చారు. 


ప్రస్తుతం కేంద్రం తొమ్మిది రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. ఆ స్కీమ్స్‌లో మార్పులను ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ నెల 7వ తేదీన నోటిఫై చేసింది.


సెంట్రల్‌ గవర్నమెంట్‌ అమలు చేస్తున్న 9 స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన ‍‌(SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP), పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (POTD), అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY). ప్రతి పథకానికి వేర్వేరు ఫీచర్లు, పదవీకాలాలు, వడ్డీ రేట్లు వరిస్తాయని గమనించాలి.


సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో మారిన రూల్‌
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ కోసం కొత్త నిబంధనను ఆర్థిక శాఖ తీసుకొచ్చింది. కొత్త రూల్‌ ప్రకారం, ఈ ఖాతా తెరవడానికి ఉన్న సమయాన్ని మూడు నెలలకు పొడిగించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఒక వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల లోపు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఖాతాను తెరవొచ్చు. ఇప్పటి వరకు ఈ వ్యవధి ఒక నెల మాత్రమే. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందిన తేదీని ఖాతా ఓపెనింగ్‌ సమయంలో రుజువుగా చూపాలి.


PPFలో కొత్త రూల్
PPF ఖాతా ముందస్తు మూసివేత (premature closure) గురించి నోటిఫికేషన్ కొన్ని మార్పులు చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ పథకాన్ని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (సవరణ) పథకం, 2023 అని పిలుస్తారు.


నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్
ఐదేళ్ల ఖాతా కోసం డిపాజిట్‌ ఖాతా తెరిచి, ఆ మొత్తం మెచ్యూర్‌ కాకముందే నాలుగు సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే రేటుతో వడ్డీని చెల్లిస్తారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం, డిపాజిట్ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల కాల డిపాజిట్ ఖాతాను మూసివేస్తే, మూడేళ్ల కాల డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటును చెల్లించేవారు.


2023 అక్టోబర్-డిసెంబర్ కాలానికి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు:


PPF - 7.1 శాతం
SCSS - 8.2 శాతం
సుకన్య సమృద్ధి యోజన - 8.0 శాతం
NSC - 7.7 శాతం
PO-నెలవారీ ఆదాయ పథకం - 7.4 శాతం
కిసాన్ వికాస్ పత్ర - 7.5 శాతం
1-సంవత్సరం డిపాజిట్ - 6.9 శాతం
2-సంవత్సరాల డిపాజిట్ - 7.0 శాతం
3 సంవత్సరాల డిపాజిట్ - 7.0 శాతం
5 సంవత్సరాల డిపాజిట్ - 7.5 శాతం
5-సంవత్సరాల RD - 6.7 శాతం


పన్ను మినహాయింపు
ఈ పథకాల్లోని కొన్నింటిలో పెట్టుబడి పెడితే పన్ను ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని (Income Tax Act) వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు లభిస్తాయి. SCSS, PPF వంటి వాటికి IT చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: 1960ల నాటి వింటేజ్ బైక్ మళ్లీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో - డిజైన్ మాత్రం సూపర్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial