Central Taxes Share To AP And Telangana: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను (Central Taxes) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. ముందస్తు వాటాగా రూ.89,086 కోట్లతో కలిపి రూ.1,78,173 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్రాల అభివృద్ధి, మూలధన వ్యయానికి ఊతమిస్తాయని కేంద్రం భావిస్తోంది. తెలంగాణకు (Telangana) రూ.3,745 కోట్లు, ఏపీకి (AP) రూ.7,211 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా యూపీకి రూ.31,962 కోట్లు, బీహార్‌కు రూ.17.921 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,987 కోట్లు, మహారాష్ట్రకు రూ.11.255 కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ.13,404 కోట్లు, రాజస్థాన్‌కు రూ.10,737 కోట్లు, ఒడిశాకు రూ.8,068 కోట్ల వాటా దక్కింది.






కేంద్రం కీలక నిర్ణయం


అటు, ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను తెలంగాణకు కేటాయించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఐఏఎస్‌లు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతి పాటు ఐపీఎస్‌లు అంజనీ కుమార్, అభిషేక్ మొహంతి తదితరులు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. వీరి అభ్యర్థనను తిరస్కరించిన కేంద్ర తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే వారిని తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే, ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటిలను సైతం రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.


ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అధికారులను ఏపీ, తెలంగాణకు కేంద్రం సర్దుబాటు చేసింది. అయితే, వారిలో కొందరు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వివిధ కారణాలు చూపుతూ తమను తెలంగాణ కేడర్‌కు మార్చాలని కోరారు. ఇదే విషయంపై గతంలో క్యాట్‌ను సైతం ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న క్యాట్.. వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే, క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్రం విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్‌ను నియమించి ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం.. అధికారుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ తాజాగా ఆదేశాలిచ్చింది.


Also Read: Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?