Ratan Tata Last Rites Completed: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. ముంబైలోని (Mumbai) వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర నేతలు రతన్ టాటా పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. అంతకు ముందు ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్ నుంచి వర్లి శ్మశానవాటిక వరకూ రతన్ టాటా అంతిమయాత్ర సాగింది. ఆ మహనీయుణ్ని కడసాచి చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. రతన్ టాటా పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.














భిన్న సంప్రదాయం


హిందూ, ముస్లింల మాదిరిగా కాకుండా పార్సీల అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. ఈ మతంలో మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా భావించి.. దేహాన్ని తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం లేదా ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన గాలి, నీరు, అగ్ని కలుషితమవుతాయని జొరాస్ట్రియన్ల విశ్వాసం. అందుకే ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పార్సీ సంప్రదాయం ప్రకారం ముందుగా ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పార్థీవదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. ఆ ప్రాంతాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ (Tower Of Silence) లేదా దఖ్మా (Dakhma) అని పిలుస్తారు. రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో భౌతిక కాయాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోఖ్‌మేనాశీనిగా (Dokhmenashini) పేర్కొంటారు. మన దేహం ప్రకృతి నుంచే వచ్చిందని అది అలాగే తిరిగి ఐక్యమవ్వాలనేది పార్సీ మతస్థుల ఆశయం.


ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా బుధవారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయన పార్థీవ దేహాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఎన్‌సీపీఏ వద్ద ఉంచారు. పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఆయన్ను కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. 


Also Read: Ratan Tata: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా