Central Minister Ram Mohan Responds On Delhi Airport Roof Collapsed Incident: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో (Delhi Airport) టెర్మినల్ - 1 రూఫ్‌లోని కొంత భాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. సహాయక చర్యలు చేపట్టారు. అటు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూఫ్ పడిన ప్రాంతాన్ని పరిశీలించి.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. టెర్మినల్ - 1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలిచ్చామన్నారు.







పరిహారం ప్రకటన


కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడ్డ వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రకటించారు. 'ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. టెర్మినల్-2, టెర్మినల్-3 నుంచి విమానాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రయాణికులకు టిక్కెట్ ఛార్జీలు వెనక్కి ఇస్తాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ఈ రోజు కూలింది పాత భవనంలోని పైభాగం. 2009లో నిర్మించిన భవనం పైకప్పు మాత్రమే కూలింది. ఇది ప్రధాని మోదీ ప్రారంభించింది కాదు. ఆ భవనం అవతలి వైపు ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతాం.' అని పేర్కొన్నారు.


ఇదీ జరిగింది


ఢిల్లీలో గత 2 రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలివానకు ఎయిర్ పోర్టులోని టెర్మినల్ - 1లో పైకప్పు కుప్పకూలింది. ఈ రూఫ్ ట్యాక్సీలు సహా పలు కార్లపై పడడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎయిర్ పోర్టు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మొదట నలుగురిని రెస్క్యూ చేశామని తర్వాత శిథిలాల కింద మరో ఇద్దర్ని గుర్తించి బయటకు తీసినట్టు ఎయిర్ పోర్టు అధికారి తెలిపారు. అదే టైంలో ఒకరు మృతి చెందినట్టు కూడా గుర్తించామని పేర్కొన్నారు. అటు, ఈ ఘటనతో టెర్మినల్ - 1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు పూర్తి కాగానే సర్వీసులు పునరుద్ధరించనున్నారు. 


భారీ వర్షాలు


మరోవైపు, ఇప్పటివరకూ భానుడి ఉగ్రరూపంతో వేడెక్కిన ఢిల్లీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి రాకతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అయితే, ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 










Also Read: Delhi Rains: భారీ వర్షాలకు కుప్పకూలీన ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్‌- ఒకరు మృతి పలువురికి గాయాలు