ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత సీక్రెట్‌ ఏజెంట్ల హస్తం ఉందన్నకెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలతో, ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం రాజుకుంటూనే ఉంది. కెనడా ఆరోపణలపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో కెనడా ఆరోపణలు చేసిందని మండిపడింది. అంతేకాదు, భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడాన్ని తీవ్రంగా పరిగణించింది భారత ప్రభుత్వం. ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని గతంలో రెండు వారాల డెడ్‌లైన్‌ విధించింది. గడువు  ముగిసినా, భారత్‌ పట్టు విడవకపోవడంతో... కెనడా.. ఇండియాలోని 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. 41 మంది దౌత్యవేత్తలతో పాటు 42 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపిచుకుంది. ఈ సందర్భంగా... భారత్‌పై మరోసారి విమర్శలు గుప్పించింది కెనడా. 


ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకోవాలని భారత్‌ డెడ్‌లైన్‌ పెట్టడంపై కెనడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌత్యవేత్తలను రీకాల్‌ చేయకపోతే వారి అధికారాలను  రద్దు చేస్తామని చెప్పడం అనైతికమన్నారు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ. దౌత్యవేత్తలు గుర్తింపు రద్దుతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న కారణంగా, వారిని స్వదేశానికి పిలిపించుకుమన్నామని చెప్పారు. దౌత్య గుర్తింపు రద్దు వంటి నిర్ణయాలతో, ప్రపంచంలోని ఏ దౌత్యవేత్త క్షేమంగా ఉండరని అన్నారు మెలానీ జోలి.  భారత దౌత్యవేత్తల విషయంలో తాము ఇలాంటి చర్య తీసుకోమని అన్నారు. 


జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య జరిగింది. గురుద్వారా వెలుపల హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను కాల్చి చంపారు. ఇది భారత్‌ రహస్య ఏజెంట్ల పనే అని కెనడా  ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. నిజ్జర్ హత్యతో తమ ఏజెంట్లకు సంబంధం ఉందన్న ట్రూడో ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. రాజకీయ దురుద్ధేశంతోనే కెనడా ఈ ఆరోపణలు చేసిందని కొట్టిపారేసింది భారత్‌. భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. అప్పటి నుంచి భారత్‌-కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతూనే ఉంది. భారత్‌ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. అక్టోబర్‌ 10లోగా, తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు డెడ్‌లైన్‌ పెట్టింది. అయితే, గడువు ముగిసిన 10 రోజుల తర్వాత... కెనడా తమ దౌత్యవేత్తలను స్వదేశానికి పిలిపించుకుంది. పైగా... ఇది భారత్‌ కక్ష సాధింపు చర్య అంటూ  విమర్శలు గుప్పించింది.


దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాలని భారత్‌ గతంలోనూ కెనడాకు సూచించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై కెనడా ఆరోపణలతో ఈ  అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. ఆ సంఖ్య సమం చేయాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం 60 మందికి పైగా దౌత్యవేత్తలు ఉండటంతో, 41 మందిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. కానీ... కెనడా మాత్రం ఇది కక్ష సాధింపు చర్యగా చెప్తోంది. దౌత్యవేత్తల అధికారులు రద్దు చేస్తామని చెప్పడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అంటూ ఆరోపిస్తోంది.