Bus Accident in J&K: 


జమ్ముకశ్మీర్‌లోని దొడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అస్సర్‌ ప్రాంతంలో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రస్తుత సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కిష్త్వర్‌ నుంచి జమ్ముకి వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. గాయపడ్డవారిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు ట్వీట్ చేశారు. దొడ జిల్లా కమిషనర్‌తో ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. గాయపడ్డ వారిని తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. జమ్ముకి వస్తున్న దారిలోనే బస్‌ స్కిడ్ అయ్యి లోయలో పడిపోయింది. ఇప్పటికే అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. కొంత మందిని రక్షించారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. 






"జిల్లా అధికారులతో ఇప్పుడే మాట్లాడాను. బస్సు ప్రమాదంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను. గాయపడ్డ వాళ్లను హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు. వీళ్లను తరలించేందుకు హెలికాప్టర్ సర్వీస్‌ అందుబాటులో ఉంచుతాం. వీలైనంత వరకూ అన్ని విధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం"


- జితేంద్ర సింగ్, కేంద్రమంత్రి






ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడ్డవాళ్లకు రూ.50 వేల పరిహారం అందజేస్తామని ప్రకటించారు.