Monkey Attack in Gujarat: 


గుజరాత్‌లో ఘటన..


గుజరాత్‌లో (Gujarat News) ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కోతి పదేళ్ల బాలుడిపై (Monkey Attack on Boy) దాడి చేసి దారుణంగా చంపేసింది. కడుపుని చీల్చి పేగులు బయటకు తీసింది. గాంధీనగర్‌లోని సల్కీ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ ఆలయం సమీపంలో కోతి బాలుడిపై దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితుడి పేరు దీపక్ ఠాకూర్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఓ కోతుల గుంపు (Boy Attacked by Monkey) అక్కడికి వచ్చింది. వాటిని చూసి పిల్లలు హడలెత్తిపోయారు. తప్పించుకునే లోగానే బాలుడిపై కోతులు దాడి చేశాయి. గోళ్లతో రక్కాయి. ఆ తరవాత ఓ కోతి బాలుడిపై అమాంతం దూకి దాడి చేసింది. ఈ దాడిలోనే కడుపుని గోళ్లతో చీల్చేసింది. పేగులు బయటకు తీసింది. ఈ మధ్య కాలంలో ఇదే గ్రామంలో కోతుల దాడులు పెరిగిపోతున్నాయి. స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. వారం రోజుల్లోనే మూడోసారి ఇలా దాడి జరిగినట్టు చెబుతున్నారు. అటవీ అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. వరుస దాడులతో వాళ్లూ అప్రమత్తమయ్యారు. వీలైనంత త్వరగా కోతుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 


"ఇప్పటి వరకూ రెండు కొండ ముచ్చుల్ని పట్టుకున్నాం. మరి కొన్ని కొండముచ్చుల్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామంలో కోతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందులో నాలుగు పెద్ద కోతులు పదేపదే ఇక్కడి వారిపై దాడులు చేస్తున్నాయి. గత వారం రోజులుగా వీటి బెడద ఎక్కువైంది. ఇద్దరు బాధితుల్ని రక్షించగలిగాం. వీలైనంత వేగంగా అన్ని కోతుల్నీ పట్టుకుంటాం"


- అటవీ అధికారులు


గతేడాది మధ్యప్రదేశ్‌లో..


గతేడాది మధ్యప్రదేశ్‌లో కోతులు స్థానికులకు చుక్కలు చూపించాయి. ఓ ఊరు ఊరంతా కోతుల బెడదతో కునుకు తీయలేదు. ఎప్పుడుపడితే అప్పుడు వచ్చి దాడులు చేశాయి. దాదాపు 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దాడి చేసిన కోతిని పట్టిచ్చిన వారికి రూ.21 వేల నజరానా కూడా ప్రకటించారు అధికారులు. ఎలాగోలా కష్టపడి చివరకు ఆ కోతిని పట్టుకున్నారు.