Rescue Operations In Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీ జిల్లా (Uttarkashi District) సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) నాలుగో రోజుకు చేరుకుంది. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 14న మరో సారి టన్నెల్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది గాయపడ్డారు. వారిని తాత్కాలిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంతకు ముందు ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ అభిషేక్ రుహేలా(Abhishek Ruhela) రెస్క్యూ ఆపరేషన్‌పై స్పందించారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు పైపులను ఆగర్ మెషిన్ సాయంతో చొప్పించే పనులు ప్రారంభించినట్లు విలేకరులతో చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే, చిక్కుకున్న కార్మికులను బుధవారం నాటికి ఖాళీ చేయిస్తామని చెప్పారు. అయితే నవంబర్ 14న రాత్రి మరోసారి కొండ చరియలు విగిపడడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడింది.
దీంతో కొత్త డ్రిల్లింగ్ మిషన్ అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాట్‌ఫాం లెవలింగ్ పనులు జరుగుతున్నాయి. కార్మికులు ఉండే బఫర్ జోన్‌కు 900 ఎంఎం పైపులు వెళ్లేలా కొండ చరియల శిథిలాలను తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకుని బఫర్ జోన్‌లో ఉన్న కార్మికులకు ట్యూబ్‌ల ద్వారా ఆక్సిజన్, నీరు, ఆహార ప్యాకెట్లు, మందులు అందిస్తున్నారు. అంతే కాదు వారి రక్షించేందుకు ఏర్పాట్లను సైతం ముమ్మరంగా చేపడుతున్నారు. డ్రిల్లింగ్ యంత్రం ద్వారా కొండ చరియల శిథిలాలను తొలగించి ఆ తరువాత 800, 900 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న ఉక్కు పైపులను ఒక్కొక్కటిగా శిథిలాల మీదుగా జొప్పించి కార్మికులను రక్షించాలని ప్రణాళికలు వేస్తున్నారు.
సిల్కియారా - దండల్ గావ్ మధ్య టన్నెల్ నిర్మాణం
ఉత్తరకాశీ జిల్లాలో బ్రహ్మఖల్ యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్ గావ్ వరకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న ఈ ఆల్-వెదర్ టన్నెల్ నిర్మాణం కారణంగా ఉత్తరకాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు ప్రయాణం 26 కిలోమీటర్లమేర తగ్గనుంది. సిల్క్యారాలోని నాలుగున్నర కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ సొరంగంలో 150 మీటర్ల భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం ఒక్కసారి కూలిపోవడంతో 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వీరంతా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాఖం, హిమాచల్ రాష్ట్రాలకు చెందిన వారు.
కార్మికులు క్షేమం
బఫర్ జోన్‌లో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నట్లు నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంశూ మనీష్ ఖాల్కో తెలిపారు. ఆహారం, నీరు అందిస్తున్నట్లు చెప్పారు. వారు నడవడానికి, ఊపిరి పీల్చుకోవడానికి దాదాపు 400 మీటర్ల స్థలం ఉందని వెల్లడించారు. రెస్క్యూ టీమ్‌లు వాకీ-టాకీస్‌తో కార్మికులతో విజయవంతంగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేశాయి. రేడియో హ్యాండ్‌సెట్‌లను ఉపయోగించి కనెక్ట్ చేయగలిగారు.