Brother and Sister married: ఎన్నిక‌ల్లో గెలిచేందుకు పార్టీలు ప్ర‌జ‌లకు అనేక హామీలు ఇస్తుంటాయి. వీటిని అధికారంలోకి వ‌చ్చాక నెరువేరుస్తాయి కూడా. ఇలా.. ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు ఇచ్చే సంక్షేమ కార్య‌క్రమాల విష‌యంలో కొన్ని కొన్ని సార్లు త‌ప్పులు దొర్లుతుంటాయి. అర్హులు కాక‌పోయినా పింఛ‌న్లు తీసుకోవ‌డం.. త‌మ వ‌య‌సును ఎక్క‌వుగా చూపి ప‌థ‌కాలు అందుకోవ‌డం తెలిసిందే. అదేవిధంగా ఆదాయ ప‌న్ను ప‌రిధిలో ఉండి కూడా తెల్ల‌రేష‌న్ కార్డు(White ration cards) పొందుతున్న కేసులు కూడా కొత్త‌కాదు. అయితే.. వీటిని గుర్తించాక‌.. ప్ర‌భుత్వాలు స‌రిచేస్తుంటాయి. అర్హులైన వారికి మాత్ర‌మే ఆయా ప‌థ‌కాలు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటాయి. కానీ, తాజాగా వెలుగు చూసిన ఓ ఘ‌ట‌న ఇలా స‌రిదిద్దుకునే అవ‌కాశం లేక‌పోగా.. సంప్ర‌దాయ వివాహాల క్ర‌తువునే నివ్వ‌ర‌ప‌రిచేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న వెలుగు చూసిన త‌ర్వాత‌.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇదేం దారుణం అని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. మ‌రి ఆ ఘ‌ట‌నేంటో చూద్దామా..!


ఏం జ‌రిగిందంటే..


ఉత్తర్​ప్రదేశ్‌(UP)లోని బీజేపీ(BJP) ప్ర‌భుత్వం.. పేద కుటుంబాల్లోని యువ‌తుల‌కు ప్ర‌భుత్వ‌మే అన్ని ఖ‌ర్చులూ భ‌రించి పెళ్లి చేసేలా `ముఖ్య‌మంత్రి సామూహిక వివాహం`(Chief Minister's mass marriage) ప‌థ‌కానికి ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చింది. దీనిని ఏటా అమ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుత ఏడాదిలోనూ ముఖ్య‌మంత్రి(CM) యోగి ఆదిత్య‌నాథ్(Yogi Aditya nath) ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించారు. ఈ ప‌థ‌కానికి అర్హులైన యువ‌తుల‌కు జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో సామూహిక వివాహాల‌ను ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తుంది. అంతేకాదు.. వివాహ స‌మ‌యంలో వ‌ధువుకు రూ.51 వేలను కానుక‌గా ఇస్తుంది. అదేవిధంగా సారె కింద ప‌రుపు, మంచం, రెండు బిందెలు, ఒక గ్యాస్ క‌నెక్ష‌న్‌, బీరువా, వంట సామాగ్రి, కంచాలు పళ్లాల‌ను కూడా ఇస్తున్నారు. ఇవ‌న్నీ పేద కుటుంబాల్లోని వారికే ప‌రిమితం. దీనికి ఎక్కువ మందే ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. వారిలోనూ అర్హుల‌ను మూడు ద‌శ‌ల్లో వ‌డ‌బోసి ఎంపిక చేసి సామూహిక వివాహాలు జ‌రిపిస్తున్నారు. వేదిక‌పైనే.. వ‌ధూవ‌రుల‌కు ఈ కానుక‌లు ఇస్తున్నారు. ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళకు ముందే వివాహం కూడా కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో విష‌యం తెలిసిన  భర్త ఫిర్యాదు చేయ‌డంతో దారుణ వ్య‌వ‌హారం వెలుగు చూసింది. ఫ‌లితంగా ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. 


విష‌యం ఇదీ.. 


మహారాజ్​గంజ్​ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్​లో మార్చి 5వ తేదీన `ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం` కింద 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు ఘనంగా పెళ్లి చేశారు.  అయితే ఆ రోజు ఓ యువతి ఈ పథకం కింద‌ వచ్చే సొమ్ము, కానుకల కోసం కక్కుర్తిపడి తన సోదరుడితో ఏడడుగులు నడిచింది. ఆమెకు ఏడాది క్రితమే వివాహం జరగ్గా, ప్రస్తుతం భర్త జీవనోపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే సామూహిక వివాహం కింద తన భార్య మళ్లీ పెళ్లి చేసుకున్న విషయాన్ని అతడికి గ్రామస్థులు తెలిపారు. ఫొటోలు కూడా పంపారు. దీంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. అసలు విషయం తెలుసుకోమని స్నేహితులకు పంపాడు. అనంతరం అధికారులకు జరిగిన విషయాన్ని చేరవేశాడు.  "సీఎం వివాహ పథకం కింద అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారని తెలిసి విచారణ చేపట్టాం. అసలు విషయం తెలిసి యువతికి అందజేసిన వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వం అందించే నిధులను నిలిపివేశాం`` అని అధికారులు తెలిపారు.  అంతేకాదు.. ఆమెపై హిందూ వివాహ చ‌ట్టం కింద కేసు కూడా న‌మోదు చేశారు. 


అప‌హాస్యం చేసింది:  స్థానికులు


మూడు ముళ్లు-ఏడ‌డుగుల బంధాన్ని ఈమె అప‌హాస్యం చేసింద‌ని స్థానికులు విమ‌ర్శ‌లు గుప్పించారు. హిందూ సంప్ర‌దాయంలో వివాహానికి ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని.. దీనిని ఆమె కాల రాచింద‌ని నిప్పులు చెరుగుతున్నారు. పోయి పోయి.. సొంత సోద‌రుడినే వివాహం చేసుకోవ‌డం ఏంట‌నేది ఒక వాద‌న అయితే.. భ‌ర్త జీవించి ఉండ‌గానే అత‌నిని ఏమార్చ‌డం మ‌రో వాద‌న‌గా వినిపిస్తోంది. మొత్తానికి దీనిపై సీఎం యోగి కూడా సీరియ‌స్ అయ్యారు. మ‌రి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.