రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు. జైపుర్ లోని ఓ భవనంలో 100 ప్రైవేట్ లాకర్లలో రూ.500 కోట్ల నల్ల ధనం సహా 50 కేజీల బంగారం దాచి ఉంచారని ఆరోపించారు. పోలీసులు వచ్చి వాటిని తెరవాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ లాకర్లు ఎవరికి చెందినవనే వివరాలను ఆయన వెల్లడించలేదు. పోలీసులు వచ్చి లాకర్లు తెరిచే వరకూ తాను అక్కడే కూర్చుంటానని చెప్పారు.
మాధోపుర్ నుంచి బరిలో
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు నవంబరులో జరగనుండగా, కిరోడిలాల్ మీనా సవాయి మాధోపుర్ నుంచి బరిలో ఉన్నారు. ఈ లాకర్లు ఎవరివనే వివరాలను ఇప్పుడే బయట పెడితే, రాజకీయ ఒత్తిళ్లతో వాటిని తెరవనివ్వరన్నారు. లాకర్లు ఉన్న భవనం వద్దకు తనతో కలిసి రావాలని మీడియా ప్రతినిధులను కోరారు. స్వయంగా పోలీసులే వచ్చి ఈ లాకర్లు తెరవాలని డిమాండ్ చేశారు.
ఈడీ దాడులు
ప్రస్తుతం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సన్నిహితుల ఇళ్లల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు చేస్తుండగా, రాజకీయ వేడి రాజుకుంది. దుంగార్ పూర్ లోని కాంగ్రెస్ నేత దినేష్ ఖోడ్నియా నివాసంలోనూ ఈడీ తనిఖీలు చేస్తోంది.
మారిన ఎన్నికల తేదీ
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే, తొలుత నవంబర్ 23నే ఓటింగ్ తేదీగా ప్రకటించగా, అదే రోజును రాష్ట్రంలో వేల సంఖ్యలో వివాహాలు జరగనుండడంతో ఓటింగ్ పై ప్రభావం కాకుండా ఎన్నికల అధికారులు పోలింగ్ తేదీని మార్చారు.
ఈసారి ట్రెండ్ మారేనా.?
రాజస్థాన్ లో గత 4 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి విజయం సాధించలేదు. అయితే, ఈసారి ట్రెండ్ మారుస్తామని మళ్లీ అధికారంలోకి తామే వస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ నేతలు సైతం ఈసారి రాజస్థాన్ లో అధికారం చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.