Ganguly Kolkata Sheriff: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, డేరింగ్ అండ్ డ్యాషింగ్ ప్లేయర్ సౌరవ్ గంగూలీకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీసీసీఐ చీఫ్ అయ్యాక దాదా స్థాయి మరో రేంజ్ కు వెళ్లింది. క్రికెట్ తోనే జర్నీ చేసిన దాదా.. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనకు దూరంగా ఉండటం లేదు. గత పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ గంగూలీ చుట్టూ రాజకీయం సాగింది. బెంగాల్ లో మమత బెనర్జీ స్థాయి పాపులారిటీ, క్రేజ్ ఉన్న గంగూలీని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించినా ఆయన మాత్రం రాజకీయాల్లోకి రాబోనని సున్నితంగా నో చెప్పేశారు. ఆ ఎపిసోడ్ అంతటితో ముగియగా.. ఇప్పుడు మరోసారి దాదా చుట్టూ రాజకీయం నడుస్తోంది.


'త్రిపురకు దాదా - బెంగాల్‌కు కింగ్ ఖాన్'


పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర టూరిజానికి కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీని తమ రాష్ట్ర టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఆ క్షణం నుండి బీజేపీ నాయకులు మమత బెనర్జీని, తృణమూల్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. 


Also Read: Gangavva: నాకేం దెల్వదు సారు, క్షమించండి! చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణ


'తప్పును సరిదిద్దుకుని షెరీఫ్‌ను చేయండి'


టీఎంసీ సర్కారు సౌరవ్ గంగూలీకి తగిన గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగాల్ లో పుట్టి భారతీయ క్రికెట్ లో లెజెండ్ స్థానాన్ని అందుకున్న దాదాకు మీరివ్వని గౌరవాన్ని మేమిచ్చామని, త్రిపురకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించామని వ్యాఖ్యానిస్తున్నారు. మమతా బెనర్జీ సర్కారు దాదాను తీవ్రంగా అవమానపరిచిందని వ్యాఖ్యానిస్తున్నారు. బెంగాల్ రాష్ట్ర సర్కారు చేసిన ఆ తప్పును సరిదిద్దుకునేందుకు సౌరవ్ గంగూలీని కోలకతా షెరీఫ్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. 
'టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సౌరవ్ గంగూలీకి ఎప్పుడూ తగిన గౌరవం ఇవ్వలేదు. బీజేపీ నేతృత్వంలోని త్రిపుర సర్కారు దాదాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. భారత క్రికెట్ లెజెండ్ ను మెట్రోపోలిస్ షెరీఫ్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. 


'అప్పుడు మీవి మొసలి కన్నీరు'


గతేడాది బీసీసీఐ చీఫ్ పదవి నుండి గంగూలీని తొలగించి కర్ణాటకు చెందిన రోజర్ బిన్నీని నియమించారు. ఈ అంశంపై స్పందిస్తూ మమత బెనర్జీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుండి దాదాను తొలగించడం దిగ్భ్రాంతి కలిగించిందని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రతీకారంగానే బెంగాల్ కు చెందిన వ్యక్తిని బీసీసీఐ చీఫ్ పదవి నుండి తొలగించారని విమర్శలు చేశారు. బెంగాల్ ఎన్నికల వేళ దాదా బీజేపీలో చేరకపోవడం వల్లే ఇలా అవమానపరుస్తున్నారని ఆరోపించారు. అప్పుడు మమత బెనర్జీ మొసలి కన్నీరు కార్చారని.. దాదాకు తామెప్పుడు సరైన గౌరవం ఇస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రభుత్వం గంగూలీని పట్టించుకోకపోయినా.. బీజేపీ ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇస్తుందన్నారు.


Also Read: Nitesh Pandey Death: బాలీవుడ్ లో తీవ్ర విషాదం, హోటల్‌ గదిలో శవమై కనిపించిన ప్రముఖ నటుడు


కావాలనే రాజకీయం చేస్తున్నారు: టీఎంసీ


సినిమా నటులను, క్రికెటర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం మాములు విషయమే అని.. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి గొప్పగా ఏమీ చేయలేదని టీఎంసీ విమర్శిస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ కావాలనే రాజకీయం చేస్తోందని, సౌరవ్ గంగూలీని బీసీసీఐ చీఫ్ గా తొలగించి ఎంతలా అవమానపరిచారో దేశం మొత్తం తెలుసు అని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు.