New Tesla Factory in India:
భారత్‌లో టెస్లా యూనిట్..!
ఎలన్ మస్క్ స్థాపించిన టెస్లా (Tesla) గ్లోబల్‌గా ఎంత ఫేమ్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రకరకాల హై ఎండ్ కార్లతో మార్కెట్‌లో దూసుకుపోతోంది ఈ కంపెనీ. ఇప్పుడు ఆ మార్కెట్‌ని విస్తృతం చేసుకునే పనిలో పడ్డారు మస్క్. ఇందులో భాగంగానే భారత్‌లోనూ ఓ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే...అందుకు భారత ప్రభుత్వంతో ఇంకా సయోధ్య కుదరడం లేదు. నిబంధనలు కాస్త కఠినంగా ఉన్నాయంటూ గతంలోనూ మస్క్ అసహనం వ్యక్తం చేశారు. కానీ...భారత్ మాత్రం "వెల్‌కమ్" అని పదేపదే చెబుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎలన్ మస్క్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికల్లా మరో కొత్త ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని చెప్పారు. Wall Street Journalకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. "ఆ ఫ్యాక్టరీని ఇండియాలో పెడతారా" అని రిపోర్టర్ ప్రశ్నించగా.."తప్పకుండా" అని బదులిచ్చారు మస్క్. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్‌ని తయారు చేసుకునే విషయంలో టెస్లా చాలా సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేశారు. అంతకు ముందు మెక్సికోలో ఓ భారీ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆయన దృష్టి భారత్‌పై పడింది. ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్లేస్ కూడా వెతుకుతున్నట్టు సమాచారం.
కీలక భేటీ..
గత వారమే టెస్లా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ న్యూఢిల్లీలో భారత అధికారులతో చర్చలు జరిపారు. మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది టెస్లా. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. అయితే..గతంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా ఎంతో ఆసక్తి చూపిస్తోందని తేల్చి చెప్పారు. ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాలని టెస్లా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోందని, భారత్‌ని ప్రొడక్షన్, ఇన్నోవేషన్ బేస్‌గా పరిగణిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకూ అయితే..దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. గతంలోనే కేంద్రం టెస్లాకు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఇండియాలో విద్యుత్ వాహనాలు విక్రయించే ఆలోచన ఉంటేనే...ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవాలని సూచించింది. చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా లోకల్‌గానే ఈవీలు తయారు చేయాలనే ఆలోచన ఉంటే..టెస్లాకు వెల్‌కమ్ చెప్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే..ఎలన్ మస్క్ మాత్రం ఈ డీల్‌కి ఒప్పుకోలేదు.
"వాహనాలు విక్రయించే వీల్లేకుండా కేవలం వాటిని తయారు చేయడానికి మాత్రమే అనుమతినిస్తామంటే...అలాంటి డీల్ మాకు అవసరం లేదు. అలాంటి చోట టెస్లా యూనిట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టదు"
- ఎలన్ మస్క్, టెస్లా సీఈవో
అయితే..ప్రస్తుతానికి మస్క్ మామ మనసు మార్చుకుంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికాకే పరిమితం కాకుండా ఇంటర్నేషన్ మార్కెట్‌లోనూ తమ సత్తా చాటాలని చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అమెరికా, చైనా మధ్య విభేదాలు పెరుగుతుండటం వల్ల వీలైనంత త్వరగా తమ మార్కెట్‌ని విస్తృతం చేసుకోవాలని చూస్తున్నారు. అటు చైనా ఇప్పటికే బ్యాటరీ తయారీలో దూసుకుపోతోంది. భారత్ కూడా నిబంధనలు సవరిస్తూ బ్యాటరీలను లోకల్‌గా తయారు చేసేందుకే మొగ్గు చూపుతోంది. అందుకే...భారత్‌పై మనసు పారేసుకున్నారు మస్క్.
Also Read: Sengol in Parliament: పార్లమెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సెంగోల్, ఏంటీ దీని కథ - ఎందుకంత ప్రత్యేకం?