Sengol in Parliament: 


ఏంటీ సెంగోల్..? 


కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర విషయం వెల్లడించారు. కొత్త పార్లమెంట్ భవనంలో Sengolని పొందుపరచనున్నట్టు చెప్పారు. అప్పటి నుంచి ఏంటీ సెంగోల్ అనే చర్చ జరుగుతోంది. దేశ స్వాతంత్య్రోద్యమంతో ముడిపడి ఉన్న అంశమిది. అసలేంటీ సెంగోల్..? మన దేశ స్వతంత్ర పోరాటానికి,దీనికి లింక్ ఏంటి..? సెంగోల్ అనే పదానికి అర్థమేంటి..? ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 






సెంగోల్ చరిత్ర..


సెంగోల్ ఓ తమిళ పదం. దీన్ని ఇంగ్లీష్‌లో Scepter అంటారు. అంటే...రాజదండం అని అర్థం. అప్పట్లో రాజులు సార్వభౌమత్వానికి చిహ్నంగా ఇది ధరించేవాళ్లు. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత అధికారాలను బదిలీ చేస్తూ  Lord Mountbatten తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకి ఇది అందజేశారు. దీని వెనకాల మరో కథ ఉంది. అది  భారత్‌కి స్వాతంత్య్రం వచ్చిన సమయం. భారత్‌కి పూర్తి అధికారాలు ఇస్తూ బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే...ఆ అధికారాలను ఎలా బదిలీ చేయాలో అర్థం కాలేదు. జవహర్‌ లాల్ నెహ్రూని లార్డ్ మౌంట్‌బట్టెన్ ఇదే ప్రశ్న అడిగారు. "బ్రిటీష్‌ నుంచి భారత్‌కు అధికారాలను ఎలా బదిలీ చేయాలి..? అని ప్రశ్నించారు. అప్పటి చివరి వైస్‌రాయ్ సీ. రాజగోపాలచారీ ( C. Rajagopalachari) అలియాస్ రాజాజీ (Rajaji)ని సలహా అడిగారు నెహ్రూ. "ఏం చేయాలో చెప్పండి" అని కోరారు. అప్పుడే రాజాజీ తీవ్రంగా ఆలోచించి ఓ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. చోళుల చరిత్రను ప్రస్తావించారు. చోళుల కాలంలో ఓ రాజు నుంచి మరో రాజుకి అధికారులు బదిలీ చేసే సమయంలో ఓ రాజదండాన్ని (Sengol) గుర్తుగా ఇచ్చేవారు. ఇదే విషయాన్ని రాజాజీ..నెహ్రూకి వివరించారు. వెంటనే మౌంట్‌బట్టెన్‌కి ఈ విషయం చెప్పిన నెహ్రూ...ఆయన నుంచి సెంగోల్‌ని స్వీకరించారు. అలా అధికారాలు బదిలీ అయ్యాయి. ఇదంతా పూర్తి తమిళ సంప్రదాయంలోనే జరిగింది. ఆ తరవాత దాన్ని అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంచారు. అప్పట్లో ఉమ్మిడి బంగారు చెట్టి అనే కంసాలి ఈ బంగారు సెంగోల్‌ని తయారు చేశారు. మొత్తం బంగారంతో తయారు చేసిన ఈ దండంపై నంది బొమ్మను చెక్కారు. 


పార్లమెంట్‌లో..


ఇదే సెంగోల్‌ని కొత్త పార్లమెంట్‌లో పొందుపరచనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. 


"1947 ఆగస్టు 14వ తేదీన తొలి ప్రధాని నెహ్రూకి ఈ సెంగోల్ అందించారు. తమిళ్‌లో సెంగోల్‌ అంటే సంపద అని అర్థం. మన దేశ చరిత్రలో ఈ సెంగోల్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది. అంతే కాదు. అధికారాల బదిలీకి ప్రతీకగా నిలిచిపోయింది"


- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి