Opposition Boycotting: 


మోదీ దూరదృష్టికి నిదర్శనం: అమిత్‌ షా


ఈ నెల 28వ తేదీన జరగనున్న కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే ప్రసక్తే లేదని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 19 పార్టీలు లేఖ రాశాయి. ఈ నిర్ణయంపై కేంద్రహోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. దీన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. ఈ పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ దూరదృష్టికి నిదర్శనం అని వెల్లడించారు. 


"ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ ముందుచూపుకి నిదర్శనం. మే 28వ తేదీన ప్రధాని ఈ భవనాన్ని దేశానికి అంకితం చేయనున్నారు. దాదాపు 60 వేల మంది కార్మికుల శ్రమతో కట్టిన భవనమిది. ఇది చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఈ కార్యక్రమంలోనే ఆ కార్మికులందరినీ ప్రధాని మోదీ సత్కరిస్తారు"


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి 






ఇదే అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. ఇదో చరిత్రాత్మకమైన సందర్భమని, రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని వెల్లడించారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పునరాలోచించాలని సూచించారు. 


"ఇది ఓ చరిత్రాత్మకమైన సందర్భం. ఇలాంటి కార్యక్రమానికి అందరూ మద్దతుగా నిలవాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. బైకాట్ చేసి అనవసరమైన అంశాలపై చర్చ జరిగేలా చేయడం సరికాదు. ఇది చాలా దురదృష్టకరం. పార్టీలన్నీ పునరాలోచించుకోవాలి. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను"


- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి






అటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ప్రతిపక్షాల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని వాళ్లు అనుకోలేదని, ఇప్పుడది సాధ్యమయ్యే సరికి ఏం చేయాలో అర్థంకాక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. 


"ఇలా బైకాట్ చేస్తారని తెలిసిందే. కొత్త పార్లమెంట్‌ని కట్టడం వాళ్లకు ఇష్టం లేదు. ఇంత తొందరగా నిర్మాణం పూర్తవుతుందని వాళ్లు ఊహించలేదు. కానీ...గడువులోగా ఇది పూర్తైంది. ఇది చూసి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. మొహం చూయించుకోలేకే..ఇలా బైకాట్ అని నాటకాలు చేస్తున్నారు. వీరసావర్క్‌కి సంబంధించిన ఓ కీలక తేదీ రోజునే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నాం. బహుశా ఇది కూడా వాళ్లను ఇబ్బంది పెడుతుందేమో'


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి