WHO Warns Of Next Pandemic:


టెడ్రోస్ సంచలన వ్యాఖ్యలు..


కరోనా ఇక మన నుంచి దూరమైనట్టే అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ అదనామ్ టెడ్రోస్ మరో బాంబు పేల్చారు. మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అది కొవిడ్ కన్నా దారుణంగా ఉండొచ్చని అన్నారు. ఇప్పుడిప్పుడే దాదాపు అన్ని దేశాల్లో కొవిడ్‌ వ్యాప్తి తగ్గిపోతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. "కొవిడ్‌ 19 ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా తొలగించినంత మాత్రాన..ఎవరికీ ఎలాంటి ముప్పు లేదని కాదు" అని తేల్చి చెప్పారు. 


"కరోనా మహమ్మారిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ నుంచి తొలగించాం. అంత మాత్రాన ముప్పు ముగిసిందని కాదు. మరో వేరియంట్ వచ్చి ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. మళ్లీ కేసులు పెరిగి, మరణాలూ నమోదయ్యే ప్రమాదముంది. కరోనా కన్నా దారుణంగా వేధించే మహమ్మారి మరోటి పుట్టే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ప్యాండెమిక్ మళ్లీ వచ్చిందంటే అందుకు మనం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. అంతా ఒక్కటిగా పోరాడాలి"


- టెడ్రోస్, WHO డైరెక్టర్ జనరల్ 


76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో (World Health Assembly)లో ఈ వ్యాఖ్యలు చేశారు టెడ్రోస్. ప్రస్తుతం అన్ని దేశాలూ అనుసరిస్తున్న విధానాలను మరోసారి రివ్యూ చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో వీటిపై పోరాటం చేయాలంటే ప్రత్యేక మెకానిజం సిద్ధం  చేసుకోవాలని తేల్చి చెప్పారు. కొవిడ్ కారణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చేరుకోలేకపోయామని, 2030 నాటికి అవ్వాల్సిన పనులు కొన్ని మధ్యలోనే ఆగిపోయే అవకాశముందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల మందికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉండేలా చూడడమే తమ లక్ష్యమని తెలిపారు టెడ్రోస్. 


"కరోనా మహమ్మారి మనందరిపైనా ఏదో విధంగా ప్రభావం చూపించింది. ఇదే సమయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలనూ వెనక్కి నెట్టింది. ప్యాండెమిక్‌తో పోరాటం చేయడంలో ఇన్నాళ్లూ ఏ స్ఫూర్తినైతే చూపించామో...భవిష్యత్‌లోనూ ఇదే కొనసాగాలి"


- టెడ్రోస్, WHO డైరెక్టర్ జనరల్ 


గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కారణంగా విధించిన హెల్త్ ఎమర్జెన్సీని తొలగిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ కమిటీ గురువారం సమావేశమై కోవిడ్19 వ్యాప్తితో విధించిన హెల్త్ ఎమర్జెన్సీని తొలగించవచ్చు అని అభిప్రాయపడింది. ఈ మేరకు శుక్రవారం కోవిడ్19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ముగిసింది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.‘గడిచిన సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్ ద్వారా ప్రజల రోగనిరోధక శక్తి పెరిగింది. అదే సమయంలో కరోనా మరణాలు తగ్గాయి. దాంతో వైద్య వ్యవస్థపై కాస్త ఒత్తిడి తగ్గింది. చాలా దేశాలు కరోనా నిబంధనల్ని ఎత్తివేశాయి. దాంతో మనం మళ్లీ గతంలో మాదిరిగా యథాతథంగా జీవించేందుకు అవకాశం కలిగింది అంటూ’ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయస్ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ కమిటీ నిర్ణయాలను వరుస ట్వీట్లలో డబ్ల్యూహెచ్ఓ అఫీషియల్ అకౌంట్లో వెల్లడించారు.


Also Read: New Parliament Opening: కొత్త పార్లమెంట్‌ ఓపెనింగ్‌పై విపక్షాల విమర్శలు, BRS సహా పలు పార్టీలు బైకాట్