BJP Complains EC on Rahul:



రాహుల్‌పై ఫిర్యాదు..


రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లో పోలింగ్ జరుగుతుండగానే రాహుల్ ఈ ఎన్నికలపై ట్వీట్ చేశారని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమే అని మండి పడింది. సాధారణంగా ఎన్నికలకు ముందు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ 48 గంటల పాటు పోలింగ్‌ సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదు. పోస్ట్‌లు పెట్టకూడదు. కానీ రాహుల్ ఈ రూల్‌ని బ్రేక్ చేశారనేది బీజేపీ చేస్తున్న ఆరోపణ. రాహుల్ గాంధీ రాజస్థాన్ ఎన్నికలను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. వెంటనే ఆ పోస్ట్‌ డిలీట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. 


రాజస్థాన్ ఎన్నికలపై రాహుల్ ట్వీట్‌ 


"రాజస్థాన్ ప్రజలు ఉచిత వైద్యం అందిస్తున్న ప్రభుత్వానికే ఓటు వేస్తారు. తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్‌లు ఇస్తున్న, వడ్డీలేని రుణాలిస్తున్న ప్రభుత్వానికే మద్దతునిస్తారు. కులగణన చేపట్టిన ప్రభుత్వానికే జై కొడతారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ


సైలెన్స్ పీరియడ్‌ని ఉల్లంఘించారని..


ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 126ని కోట్ చేసిన బీజేపీ 48 గంటల సైలెన్స్ పీరియడ్‌ని రాహుల్ గాంధీ ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. ఎన్నికలను, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయడం, ప్రస్తావించడం శిక్షార్హమైన నేరమని తేల్చి చెబుతోంది. ఈ నేరం చేసిన వాళ్లకు చట్టం ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 


"కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారు. ఓటింగ్ జరుగుతున్న రోజున ఇలాంటివి ప్రస్తావించడం చట్ట ప్రకారం నేరం. ఎన్నికల సంఘం దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ఉచిత హామీలను ప్రస్తావించి ఓటర్లను ప్రభావితం చేయాలని చూడడం సరికాదు. కులగణన గురించి మాట్లాడడమూ నేరమే"


- బీజేపీ 


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఇప్పటికే ఓ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు పంపింది. మోదీని Panauti (దురదృష్టవంతుడు)  అని రాహుల్‌ విమర్శలు చేశారు. భారత్‌ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మోదీయేనని, ఆయన రావడం వల్లే గెలుచుకోలేకపోయామని అన్నారు. ప్రధాని మోదీ పిక్‌పాకెట్ అని కూడా విమర్శించారు రాహుల్. దీనిపై బీజేపీ తీవ్రంగా మండి పడింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకున్న ఈసీ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై బీజేపీ సీనియర్ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అభ్యంతరకరమైన భాషను వాడడం ఏ మాత్రం సరికాదని, చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. 


Also Read: Uttarakashi Tunnel Rescue Operation: మరో నెల రోజులైనా పట్టొచ్చు, రెస్క్యూ ఆపరేషన్‌పై ఎక్స్‌పర్ట్ సంచలన వ్యాఖ్యలు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply