బిపిన్ రావత్.. ఓ వెన్నుచూపని యోధుడు.. ఆర్మీ లెజెండ్! మృత్యువుతో కూడా చివరి వరకు పోరాడి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు తమిళనాడు కూనూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.. చికిత్స పొందుతూ మృతి చెందారు. హెలికాప్టర్‌లో ఉన్న 14 మందిలో 13 మంది మృతి చెందినట్లు ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. అలాంటి గొప్ప సైనికుడి గురించి నాయకుడి గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.


భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌ బిపిన్ రావత్. 2019 వరకు భారత్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌ అనే పోస్ట్ లేదు. కార్గిల్‌ యుద్ధం అనంతరం 1999లో కే సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్‌ రివ్యూ కమిటీ తొలిసారి సీడీఎస్‌ నియామక ప్రతిపాదన చేసింది. అయితే అది 2019 వరకు కార్యరూపం దాల్చలేదు.   వాయుసేన, ఆర్మీ, నౌకాద‌ళం మూడింటికి వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. అయితే వారందర్నీ సమన్వయం చేసుకోవడానికి ఓ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో  సీడీఎస్ పదవిని కేంద్రం సృష్టించింది. 2019లో తొలిసారిగా బిపిన్ రావత్‌ను సీడీఎస్‌గా నియమించారు. త్రివిధ దళాల అధిపతిగా ఆయ‌న ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రి వరకూ ఉంది.  


Also Read : ప్రకృతి రమణీయతే కాదు .. మద్రాస్ రెజిమెంట్ కేంద్రం కూడా ! కన్నూరులో అలాంటి ప్రమాదం ఎలా సాధ్యం ?


పుట్టింది.. పెరిగింది..


జనరల్ బిపిన్ రావత్  సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 16 డిసెంబర్ 1978న 11వ గూర్ఖా రైఫిల్స్‌లోని ఐదవ బెటాలియన్‌కి ఎంపికయ్యారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ నుండి గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు'స్వోర్డ్ ఆఫ్ హానర్'ను అందుకున్నాకు.  బిపిన్ రావత్ కశ్మీర్  తూర్పు సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌ తో పాటు కాశ్మీర్ లోయలోని రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్‌కు నాయకత్వం వహించారు.


డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చాప్టర్ VII మిషన్‌లో భాగంగా మల్టీనేషనల్ బ్రిగేడ్‌కు కమాండర్‌గా వెళ్లారు. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పదాతిదళానికి కమాండర్‌గా వ్యవహరించారు. ఈశాన్య ప్రాంతంలో కార్ప్స్ కమాండర్‌గా కూడా చేశారు.ఆర్మీ కమాండర్‌గా వెస్ట్రన్ ఫ్రంట్‌తో పాటు ఎడారి సెక్టార్‌లో కూడా పని చేసిన విస్తృతమైన అనుభవాన్ని గడించారు. జనరల్ రావత్ కొత్త తరం సైనికాధికారులను తయారు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తారు.


Also Read : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?


40 ఏళ్లకు పైగా..


సైన్యంలో దాదాపు 42 ఏళ్లుగా సేవలందించారు బిపిన్ రావత్. ఆయన సేవ, పరాక్రమానికి సైన్యంలో ఉండే PVSM, UYSM, AVSM, YSM, SM, VSM వంటి అనేక అవార్డులు లభించాయి. ఇవి కాకుండా, రెండు సార్లు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్‌తో పాటు ఆర్మీ కమాండర్ ప్రశంసలను కూడా పొందారు. మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. పాకిస్థాన్, చైనా, ఈశాన్య ప్రాంతంలోని సరిహద్దులకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు.


2019, జ‌న‌వ‌రిలో ఆ బాధ్యతల నుంచి రిటైర్ అయ్యారు. అంతకు ముందే ఆయన్ను దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలను ఆయన యూనిఫాం మీద పొందుపరిచారు. మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించి.. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ వ్యవహరిస్తున్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి, సైన్యాన్ని మరింత పటిష్టం చేయడం సీడీఎస్ బాధ్యత.  


Also Read : సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష


ఆయన సేవలు అనన్యం..


బిపిన్ రావత్ భారత సైనిక వ్యవస్థ అత్యంతకీలకమైన అధికారి. రక్షణ మంత్రికి ముఖ్య సైనిక సలహాదారు హోదాలో త్రివిధ దళాలకు సంబంధించిన వ్యవహారాలు ఆయన పరిధిలో ఉంటాయి. డిఫెన్స్ అక్విజిషేన్ కౌన్సిల్ , డిఫెన్స్ ప్లానింగ్ కమిషన్ లాంటి కీలకమైన రక్షణ శాఖ సంస్థల్లో ఆయనకు చోటు ఉంటుంది.  రక్షణ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కు కార్యదర్శిగా ఉంటారు. రక్షణ శాఖలో ఇది ఐదో విభాగం. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ కి సైనిక సలహాదారుడిగా సేవలు అందించారు. 


Also Read : కుప్పకూలిన సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్.. 8 మంది మృతి
    
సైనికాధికారిగా ఉంటూ బిపిన్ రావత్ కొంత వివాదాస్పదమైన ప్రకటనలు కూడా చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరగుతున్న నిరసనల విషయంలో రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. దానిపై తీవ్ర దుమారం రేగింది కూడా. అయితే అత్యంత విజయవంతమైన సైనకాధికారిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి