Biparjoy Cyclone: 


తీవ్రతరం..


బిపార్జాయ్ (Biparjoy Cyclone) తుపాను వచ్చే 24 గంటల్లో తీవ్రతరమవుతుందని తేల్చి చెప్పింది భారత వాతావరణ శాఖ (IMD). రెండ్రోజుల క్రితమే ఇది తీవ్రతరం కాగా...ఇప్పుడు మరింత బలం పుంజుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించింది. ప్రస్తుతం ఇది గోవాకు పశ్చిమ దిశలో 690 కిలోమీటర్ల దూరంలో, అటు ముంబయికి కూడా పశ్చిమ-నైరుతి దిశలో 640 కిలోమీటర్లలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. ఈ తుపాను కారణంగా...గుజరాత్‌లోని వల్సాద్‌లోని టిథాల్ బీచ్‌లో అలలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. ఫలితంగా...జూన్ 14 వరకూ బీచ్‌కి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 


"మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశాం. ఇప్పటికే సముద్రంలో ఉన్న వాళ్లంతా వెనక్కి వచ్చేశారు. అవసరమైతే తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల్ని వేరే చోటకు తరలిస్తాం. కొన్ని చోట్ల శిబిరాలు కూడా ఏర్పాటు చేశాం. టిథాల్ బీచ్‌కి సందర్శకులెవరూ రాకుండా జూన్ 14వ తేదీ వరకూ ఆంక్షలు విధించాం"


- తహసీల్దార్, వల్సాద్ 






అప్రమత్తం..


ప్రస్తుతం అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం...ఈ తుపాను సోమవారం నాటికి (జూన్ 12) దక్షిణ గుజరాత్‌ను తాకనుంది. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలూ సిద్ధమయ్యాయి. ఏదైనా అనుకోని విపత్తు వస్తే వెంటనే రంగంలోకి దిగేలా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే వెనక్కి వచ్చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. వీలైనంత త్వరగా తీరానికి వచ్చేయాలని చెబుతున్నారు. తుపాను కారణంగా జూన్ 11, 12వ తేదీల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను కారణంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. సౌత్‌ గుజరాత్‌తో పాటు సౌరాష్ట్రలోనూ వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్‌లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో దాదాపు 22 గ్రామాలున్నాయని...వీటిలో 76 వేల జనాభా ఉన్నట్టు కలెక్టర్లు వెల్లడించారు. వీళ్లందరినీ సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.