Bihar News: నేరగాళ్లు చాలా కొత్తగా ఆలోచిస్తుంటారు. వారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. కొత్త కొత్త మార్గాల్లో వారు చేసే నేరాలు ఆశ్చర్యానికి, గురి చేస్తుంటాయి. అలాంటి ఓ ఘటనపై బిహార్ లో జరిగింది. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి నేరాలకు పాల్పడుతోన్న ముఠా గ్టుట రట్టైంది. ఈ రకం నేరాలపై పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించి నేరగాళ్ల ముఠాను పట్టుకున్నారు. 


నేరాల తీరు ఇది


అది బిహార్ లోని గోపాల్ గంజ్ ప్రాంతం. అక్కడి నేషనల్ హైవేపై తిరిగే వాహనదారులే నేరగాళ్ల టార్గెట్. ముందుగా అందమైన అమ్మాయిలు హైవేలపై ఉంటారు. ఏదైనా వాహనం రాగానే లిఫ్ట్ లిఫ్ట్‌ అని అడుగుతారు. అమ్మాయిలు అలా రోడ్లపై ఒంటరిగా కనిపించడంతో జాలితో లిఫ్ట్ ఇస్తుంటారు.


అలా లిఫ్ట్ ఇవ్వగానే వాహనం ఎక్కిన అమ్మాయి తమ ముఠాకు సమాచారం అందిస్తుంది. వాళ్లు ఒక చోట కాపు కాసి ఆ వాహనం రాగానే ఒక్కసారిగా తమ విశ్వరూపం చూపిస్తారు. నేరగాళ్లంతా ఆ వాహనాన్ని చుట్టుముడతారు. మారణాయుధాలతో బెదిరిస్తారు. వాహనాన్ని, వాహనదారుడి వద్ద ఉన్న నగలు, నగదు, సెల్ ఫోన్ వంటివి దోచుకుంటారు. ఇలా దోచుకున్న సెల్ ఫోన్లను, వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద అమ్మేస్తారు.


ఇలా చాలా మంది మోసపోయారు. నగదు, సెల్‌ఫోన్లు, నగలు పోగొట్టుకున్నారు. ఈ తరహా ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కొన్ని రోజులుగా ఇలాంటి నేరాలు పెరిగిపోవడంతో ఎస్డీపీవో సంజీవ్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి హైవేపై కాపు కాశారు. ముఠా గుట్టు రట్టు చేశారు. 


కుచాయకోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ససముసాలోని శివాలయం సమీపంలో ఏడుగురు నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. వారి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం ముఠాలోని మరో నలుగురు దుండగులను అక్కడికక్కడే అరెస్టు చేశారు. 11 మంది నేరగాళ్ల నుంచి ఆయుధాలు, దోపిడీ చేసిన కారు సహా ఇతర వాహనాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


దోపిడీ వాహనాలను ఇక్కడే విక్రయిస్తారు..


జాతీయ రహదారిపై దోపిడీ చేసి వాహనాలను ముజఫర్ పూర్ కు తీసుకెళ్లి అమ్మేస్తుంటారు. ఈ దొంగ వాహనాలను విక్రయించిన వారిని, కొన్న వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరగాళ్లు ఇప్పటి వరకు ఎన్ని దొంగ వాహనాలు అమ్మారు, ఎవరెవరికి ఆ వాహనాలు అమ్మారో పోలీసులు ఆరా తీస్తున్నారు. గోరఖ్ పూర్ నుంచి ముజఫర్ పూర్ వరకు ఎన్‌హెచ్-27 పై ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.


ముందే నేరచరిత్ర


ఈ నేరాల వెనక మాస్టర్ మైండ్‌, ముఠా నాయకుడు బంటీ పాండేగా పోలీసులు గుర్తించారు. కుచయకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా సర్కిల్ కు చెందిన బంటి పాండేకు నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. హత్యాయత్నం, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం సహా ఇతర అనేక కేసులు బంటీ పాండేపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠాలో ఉన్న మరికొందరికీ నేర చరిత్ర ఉందని వెల్లడించారు. ఈ దోపిడీ ముఠాను పట్టుకున్న పోలీసు అధికారుల బృందాన్ని ఎస్పీ ప్రశంసించారు.