Wife Marriage:
కన్యాదానం సీన్ రిపీట్..
ఈవీవీ డైరెక్షన్‌లో కన్యాదానం అనే ఓ సినిమా వచ్చింది గుర్తుందిగా. శ్రీకాంత్, ఉపేంద్ర యాక్ట్ చేసిన ఆ మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. భార్యను లవర్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాడు హీరో. వాళ్లిద్దరినీ దగ్గరుండి మరీ కలుపుతాడు. అందరూ తిట్టినా పట్టించుకోడు. ఇది తెలుగులో వచ్చిన సినిమా. హిందీలోనూ దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో సంజయ్ లీలా భన్సాలీ Hum Dil De Chuke Sanam సినిమా తీశారు. సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్‌లు నటించిన ఆ మూవీ బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్. ఇప్పుడిదంతా ఎందుకు అనేగా మీ డౌట్. ఇవన్నీ సినిమాలు కాబట్టి అలా జరిగిపోతాయ్. రియల్ లైఫ్‌లో ఏ భర్తా అలా ఉండడు అని అనుకుంటాం. కానీ...బిహార్‌లోని నవాడా జిల్లాలో ఓ భర్త ఇది నిజం చేసి చూపించాడు. తన భార్యకు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు. ఇద్దరినీ ఆశీర్వదించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఆలయంలో వీళ్లిద్దరికీ పెళ్లి చేశాడు ఆ భర్త. తన ఎదురుగానే బాయ్‌ఫ్రెండ్‌తో ఆమె నుదుటిపై సిందూరం పెట్టించి మరీ ఒక్కటి చేశాడు. పక్కనే ఉన్న వాళ్లంతా దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇదీ సంగతి..
అసలు కథేంటంటే...భర్త ఇంట్లో లేని సమయంలో ఆ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు నేరుగా ఇంటికి వెళ్లింది. అయితే...కుటుంబ సభ్యులు దీన్ని గమనించి ఇద్దరినీ పట్టుకున్నారు. వెంటనే ఆ బాయ్‌ఫ్రెండ్‌ని చితకబాదారు. ఇద్దరినీ కట్టేశారు. ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. ఎప్పుడైతే ఆ మహిళ భర్త సీన్‌లో ఎంటర్ అయ్యాడో అంతా మారిపోయింది. వాళ్లిద్దరినీ అలా చూడగానే ఏమీ ఆలోచించకుండా పక్కనే ఉన్న టెంపుల్‌కి తీసుకెళ్లాడు. బాయ్‌ఫ్రెండ్‌తో సిందూరం దిద్దించి పెళ్లి చేశాడు. అతనికీ అప్పటికే పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందినప్పటికీ...ఎవరూ ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.
భర్తల మార్పిడి..
బీహార్ రాష్ట్రంలో ఈ మధ్యే ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడప్పుడు సినిమాల్లో చూపించినట్లు ఒకరి భర్తను మరొకరు ప్రేమించారు. అక్కడితో ఆగకుండా భర్తలను ఎక్స్ఛేంజ్ కూడా చేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటనను చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఇక్కడ మరో విచిత్రం కూడా ఉందండోయ్. ఇద్దరు మహిళల పేర్లు కూడా ఒక్కటే... అదే రూబీ దేవి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, చౌతం పోలీస్ స్టేషన్ పరిధిలోని పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవి 2009లో నీరజ్ కుమార్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆమెకు అదే గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ముఖేష్ కూడా వివాహం చేసుకున్నాడు. అతడి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య పేరు కూడా రూబీ దేవి. అయితే ప్రేమించుకున్న ముఖేష్, రూబీ దేవి గతేడాది ఫిబ్రవరి 6న ఇంట్లోంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. ఇలా వెళ్లిపోయిన రూబీ తనతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను తీసుకుని వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన నీరజ్ కుమార్ సింగ్ ముఖేష్‌పై స్థానిక పోలీసు స్టేషన్ లో కిడ్నాప్ కేసు పెట్టాడు. నీరజ్ కుమార్ సింగ్ ముఖేష్ సింగ్ ముందు భార్య రూబీ దేవి ఫోన్ నంబర్ సంపాదించాడు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా వారి మధ్య సంబంధం ఏర్పడింది. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 18న కోర్టు అనుమతితో నీరజ్ కుమార్ సింగ్, రూబీ దేవి వివాహం చేసుకున్నారు.