Bihar Single Leg Student : ఆ చిన్నారికి ఒక్కటే కాలు ఉంది. కానీ పట్టుదల మాత్రం మెండుగా ఉంది. అందుకే ఆ చిన్నారి ఒంటికాలుతో కిలోమీటర్ల దూరం నడుస్తూ పాఠశాలకు వెళుతోంది. చదువుకుంటోంది. ఆమె పట్టుదలకు సోషల్ మీడియా మొత్తం ఫిదా అయింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది..



బీహార్‌లోని జాముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలికకు రెండేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. అయితే సీమా మాత్రం జీవితంలో జరిగిన విషాదానికి కుంగిపోకుండా.. ఒక్క కాలుతోనే నడవాలన్న బాధను ఏమాత్రం పట్టించుకోకుండా.. రోజూ కి.మీ దూరంలో ఉన్న స్కూల్‌కి ఒంటికాలితోనే వెళ్తోంది. సీమా అలా ఒంటికాలితో బ్యాగ్‌ తగిలించుకుని.. స్కూల్‌కి వెళుతున్న వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.



 ఈ వీడియోను ప్రముఖ నటుడు సోనూసూద్‌ చూసి ఆ చిన్నారికి తను స్థాపించిన ఎన్‌జీవ్‌ సూధా ఫౌండేషన్‌ ద్వారా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సోనుసూద్‌ ట్విట్టర్‌లో 'సీమా ఇప్పుడు రెండు పాదాలపై పాఠశాలకు వెళుతుంది. నేను టిక్కెట్‌ పంపుతున్నాను.' అని పోస్ట్‌ చేశారు. 



అలాగే ఈ వీడియో పలువురి ప్రముఖులను కదిలించింది. బీహార్‌ ప్రభుత్వ భవన నిర్మాణ శాఖామంత్రి డాక్టర్‌ అశోక్‌ చౌదరి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సీమాకు తగిన సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వీరు సీమాలాంటి పిల్లలను గుర్తించి సాయం చేయాలని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.