Rakhi Festival 2022: రాఖీ పౌర్ణమి వస్తుందంటే చాలు అందరూ రకరకాల రాఖీలు కొని అన్నా, తమ్ముళ్లకి కట్టాలని చూస్తుంటారు. అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు ఒక్కచోట చేరి జరుపుకునే ఈ పండుగ అంటే అందరికీ ఇష్టమే. సోదరుడి చేతికి రాఖీ కట్టి దేవుడిని ప్రార్థిస్తుంటారు. కానీ మన దేశంలోని ఓ చోట మాత్రం ఈ పండుగను జరుపుకోరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లా భిఖాంపూర్ జగత్ పూర్వ గ్రామంలో రాఖీ పౌర్ణని పండుగ పేరు కూడా తలుచుకోరు. మనసులో పండుగను గుర్తు చేస్కునేందుకు కూడా చాలా భయపడిపోతుంటారు. కనీపం రాఖీ పండుగ పేరు చెప్పినా, విన్నా, అన్నా, తమళ్లుకు రాఖీలు కట్టినా అశుభం జరుగుతుందని వారు నమ్ముతారు. 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు ఉన్నాయంటే ఆలోచించాల్సిన విషయమే. అయితే అసలు ఆ గ్రామ ప్రజలు ఈ పండుగ జరుపుకోకపోవడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


అసలు రాఖీ పండుగను ఎందుకు జరుపుకోరు..?


1955లో భిఖాంపూర్ జగత్ పూర్వ గ్రామంలో ఒక అమ్మాయి తన సోదరుడికి రాఖీ కట్టిందట. అయితే అదే రోజు అతడిని ఎవరో హత్య చేశారు. దాని తర్వాత కూడా రెండు మూడేళ్లపాటు రాఖీ పౌర్ణమి రోజు ఇలాంటి సంఘటనలే జరగడంతో గ్రామస్థులు ఈ పండుగను చేసుకోవడమే మానేశారు. ఒకవేళ రాఖీ పౌర్ణమి రోజే ఆ కుటుంబంలో బిడ్డ పుడితే... రక్షా బంధన్ జరుపుకునే సంప్రదాయం మళ్లీ మొదలవుతుందని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. అయితే రాఖీ పండుగ సోదర సోదరీమణులు జరుపుకునే పవిత్రమైన పండగ అని వారి నమ్మకం. అమ్మాయి తన సోదరుడు చేతికి రాఖీ కడితే.. అతడు ఆమెను ఎల్లకాలం కాపాడతానని వాగ్ధానం చేస్తాడు. అయితే మన పురాణాల ప్రకారం ద్రౌపది.. శ్రీకృష్ణుడికి దారం కట్టిందని, అప్పటి నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు చెబుతారు. 


రాఖీ పండుగ పేరు వింటేనే గజగజా వణికిపోతారు..!


రక్షాబంధన్ పేరు వింటేనే ఆ గ్రామ ప్రజలు గజగజా వణికిపోతారు. కనీసం పేరు వినడానికి కూడా వారు ధైర్యం చేయరు. ఎవరి నోట్లో నుంచి కూడా రాఖీ పండుగ పేరును రానివ్వరు. అలాగే ఏ సోదరీ ఆ గ్రామంలోని సోదరుడికి రాఖీ కట్టదు. ఒకవేళ కడితే వాళ్లకు మంచి జరగదని వారు నమ్ముతున్నారు. తమ పూర్వీకల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాడు చేయడం వాళ్లకు ఇష్టం లేదని చెబుతున్నారు. అయితే పదేళ్ల క్రితం పండుగ చేసుకోవాలని అనుకున్నారట. కానీ గ్రామంలో మరో విచిత్రమైన సంఘటన జరగడంతో పండుగను చేసుకోలేకపోయారట. 


పండుగ నాడు విచిత్ర సంఘటనలు..


రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకునేందుకు గ్రామ ప్రజలంతా వేచి చూస్తున్నారట. పండుగ రోజు గ్రామంలోని ఎరికైనా బిడ్డ పుడితే రాఖీ కట్టుకోవచ్చని చూస్తుండగానే ఏళ్లు గడిచిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు. దాదాపు గ్రామంలో 200 మంది చిన్న పిల్లలు ఉన్నారని.. పండుగ రోజు జరిగే విచిత్రమైన సంఘటనలు చూసి వారంతా భయపడిపోతారని తెలిపారు. తాతల కాలం నుంచి ఇందుకు సంబంధించిన కథలను రకరకాలుగా చెప్పుకుంటారట.