New Government in Bihar:
కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిన విషయాలివే..
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే ఇది. ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది. "ఊపిరి ఉన్నంత వరకూ ఈ పార్టీలోనే ఉంటాను" అన్న వ్యక్తే, తెల్లారేసరికి పార్టీ మార్చేస్తాడు. ఇలా అధిష్ఠానాలకు షాక్‌లు ఇచ్చిన నేతలెందరో ఉన్నారు. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. దీనికి కొనసాగింపుగా జరిగిందే మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రాజకీయ పరిణామాల్లో మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు ఒకటైతే...బిహార్‌లో నితీష్ కుమార్ ఎన్‌డీయేను వదలటం మరోటి. మహారాష్ట్రలో ఇప్పటికే ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం ఏర్పాటై...అక్కడితో ఆ కథ ముగిసిపోయింది. ఇప్పుడు బిహార్ తెరపైకి వచ్చింది. ఉన్నట్టుండి నితీష్ కుమార్ ఎన్‌డీఏ నుంచి ఎందుకు బయటకు వచ్చినట్టు..? జేడీయూతో మళ్లీ పొత్తు పెట్టుకునేదే లేదని శపథం చేసిన తేజస్వీయాదవ్..చివరకు నితీష్‌తో కలవటం ఏంటి..? ఏమిటీ ఊహించని పరిణామం..? అందరికీ ఎదురవుతున్న ప్రశ్నలివే. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతిమా కుమారి. ABP Newsతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె...ఈ ఊహించని
మలుపు వెనక ఉన్నదెవరో వివరించారు.
సోనియా గాంధీ సయోధ్య కుదిర్చారా..?
కాంగ్రెస్ నేత ప్రతిమా కుమారి చెప్పిన వివరాల ప్రకారం చూస్తే...కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ మధ్య సయోధ్య కుదిర్చారు. నితీష్ కుమార్‌తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్‌తో మాట్లాడి మరోసారి ఈ రెండు పార్టీలు ఏకమయ్యేలా చేసినట్టు చెబుతున్నారు ప్రతిమా కుమారి. "బిహార్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, మీ ఇద్దరూ కలవటం ఎంతో అవసరం" అని సోనియా గాంధీ చెప్పినట్టు ప్రతిమా కుమారి ABPతో అన్నారు. మత విద్వేషాలు రెచ్చ గొడుతున్న పార్టీలను (భాజపాను ఉద్దేశిస్తూ) పక్కకు తప్పించాలి. మన ఐక్యతను చాటాలి" అని సోనియా గాంధీ చెప్పాకే, నితీష్ కుమార్ మరోసారి RJDతో కలిసేందుకు అంగీకరించారన్నది ప్రతిమా కుమారి చెబుతున్న మాట. ఒకవేళ సోనియా గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోకపోయుంటే...ఈ మహా కూటమి ఇంకెప్పుడూ సాధ్యపడేది కాదని అన్నారు ప్రతిమా. అంతే కాదు. బిహార్‌లో మంత్రి పదవి కోసమే కాంగ్రెస్ ఇలా "సయోధ్య" కుదిర్చిందన్న వాదనకు తావు లేదని స్పష్టంగా చెప్పారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే...సోనియా గాంధీ ఇలా చొరవ తీసుకున్నారన్నది ప్రతిమా చెబుతున్న మరో విషయం.
ఇందులో వాస్తవమెంత..?
అయితే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెబుతున్న దానిలో నిజమెంత అన్నదీ తేలాల్సి ఉంది. బిహార్‌లో ఈ రాజకీయ పరిణామం తరవాత కాంగ్రెస్ తరపున మొట్టమొదటగా వచ్చిన స్టేట్‌మెంట్ ఇదే. అది కూడా అధికారికంగా అయితే కాదు. దీనంతటి వెనకాల సోనియా గాంధీ హస్తం ఉందని ఆమె క్లెయిమ్ చేస్తున్నప్పటికీ...ఇప్పటివరకైతే ఆ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదంతా "సోనియా" ఆధ్వర్యంలోనే జరిగిందని చెబుతున్నాయి. ఇందులో నిజానిజాల గురించి పక్కన పెడితే...బిహార్‌లో జరిగిన ఈ మార్పు.. 2024లోక్‌సభ ఎన్నికలపై మాత్రం తప్పకుండా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఆగస్టు 24వ తేదీన బలపరీక్షకు సిద్ధమవుతున్నారు సీఎం నితీష్ కుమార్, డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్.
Also Read: Munugode TRS Plan : టీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మునుగోడు ఉపఎన్నిక - ఏ వ్యూహమైనా మైనస్సేనా ?
Also Read: Venkayya : దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?