Venkaiah Naidu:  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు ఆయన మాజీ ఉపరాష్ట్రపతి అంతే. భారతీయ జనతాపార్టీలో సభ్యుడు కూడా కాదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేసే ముందే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసింది. ఇంకే రాజ్యాంగబద్దమైన పదవి లేదు. అయితే మళ్లీ బీజేపీ సభ్యత్వం తీసుకునే ఆలోచనేదీ లేదని వెంకయ్య అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే.. ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా ? బీజేపీ కేంద్ర నాయకత్వం ఏదైనా కీలక పదవి అప్పగిస్తుందా ? 


బీజేపీలో 75 ఏళ్ల వరకే చాన్స్..తర్వాత రిటైర్మెంట్ !


బీజేపీ  పెట్టుకున్న విధానం ప్రకారం రిటైర్మెంట్ వయసు 75 ఏళ్లు.  ఈ కారణంగానే చాలా మంది సీనియర్లు బీజేపీలో యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు వెంకయ్యనాయుడు వయసు 73 ఏళ్లు. వెంకయ్యనాయుడు రాజకీయ పరంగా మంచి వ్యూహకర్త. బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీని నిలబెట్టారు.   1991 వరకు జనతాదళ్‌లో ఉన్న ధన్‌ఖడ్‌ తర్వాత బీజేపీలో చేరారు. రాజస్థాన్‌ ఎన్నికల్లో జాట్‌ల పాత్రను దృష్టిలో ఉంచుకుని ఆయనను ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. 1993 వరకు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకయ్యనాయుడు తర్వా త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. జాతీయ నాయకత్వానికి తలలో నాలుకగా మారారు. పార్టీ అధికార ప్రతినిధిగా చమత్కార శైలిలో మాట్లాడి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా అనేక నిర్ణయాల వెనుక కీలక పాత్ర పోషించారు. రాజ్యసభలో ప్రతిపక్షాలను చీల్చిచెండాడంలో తనకు తిరుగు లేదని నిరూపించుకున్న వెంకయ్య.. నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఏకైక బీజేపీ నేతగా ఘనతను సాధించారు. కానీ ఇప్పుడు మాత్రం తర్వాతేంటి అన్నదానికి సమాధానం లేకుండా పోయింది. 


మళ్లీ బీజేపీ తరపున రాజకీయాలుండకపోవచ్చు...!


రాజ్యంగ పదవిలో ఉండటంతో ఇన్నాళ్లు  ఆయన రాజకీయ ప్రసంగాలకు బ్రేక్ పడింది. ఉప రాష్ట్రపతి పదవి నిర్వహించిన తరువాత రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయిన నేతలు ఎవరూ ఇప్పటి వరకు కనిపించలేదు. వెంకయ్యకు రాజకీయంగా ఉండే ఆసక్తి తో ఆయన తన పదవీ విరమణ చేసిన తరువాత ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఉపరాష్ట్రపతి లాంటి ఉన్నత పదవి నిర్వహించిన వారికి ఇతర చిన్న పదవులు ఇస్తే లేకపోతే చేపట్టినా అవమానమే. అలాంటివి తీసుకోరు. అందుకే ఉపరాష్ట్రపతి కంటే  ఉన్నత పదవులు వెంకయ్యకు దక్కేవి ఏవీ లేవనే అనుకోవాలి. అయితే క్రియాశీల రాజకీయాలకు దూరం కానని వెంకయ్యనాయుడు చెబుతున్నారు. అయితే అది ఏ రూపంలో అనేది మాత్రం ఆయన కూడా చెప్పలేకపోతున్నారు. 


బీజేపీకి తెర వెనుక వ్యూహకర్తగా వ్యవహరిస్తారా ?


వెంకయ్యనాయుడు ఆరోగ్య పరంగా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయంగా ఆయన ఖాళీగా ఉండటం కష్టమేనని చెబుతున్నారు. బీజేపీ  వ్యూహాల్లో తెర వెనుక పాత్ర అయినా పోషిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో మోదీ, షాలు తప్ప మరొకరి వ్యూహాలు ఆలోచనలు అమలు చేసే పరిస్థితి లేదు. వారు చెప్పినట్లుగా చేయాల్సిందే. అదే సమయంలో వెంకయ్య సంప్రదాయ రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వాటికి మోదీ, షాలు వ్యతిరేకం. వారి రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. అందుకే నేరుగా కాకపోయినా బీజేపీ కీలక నిర్ణయాల్లో భాగమయ్యే  పరిస్థితి కూడా ఉంటుందా లేదా అన్నది చెప్పడం కష్టమనిఅంటున్నారు. 


స్వర్ణ భారత్ ట్రస్ట్‌పై దృష్టి పెడతారా? 


వెంకయ్యనాయుడు కుటుంబం స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా సేవా రంగంలో ఉండటంతో..ఆయన సైతం అదే బాటలో ముందుకు వెళ్తారని  చెబుతున్నారు. దశాబ్దాల పాటు రాష్ట్ర, జాతీయ రాజకీయాలు నిర్వహించి, తెలుగు దనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలించిన వెంకయ్య ఇక రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.