Munugode TRS Plan :   తెలంగాణ రాష్ట్ర సమితికి మునుగోడు ఉపఎన్నిక కత్తి మీద సాములా మారింది. గతంలోలా దూకుడుగా వ్యవహరించలేరు. నిధుల వరద పారించలేరు. అలాగని లైట్ తీసుకోరు. అన్నింటికన్నా బిన్నంగా కొత్త వ్యూహం పాటించాాల్సి ఉంది. దీంతో టీఆర్ఎస్ అధినేత ఏం చేస్తారన్నదానిపై రాజకీయవర్గాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు .. ఈ ఉపఎన్నిక సెమీ ఫైనల్‌గా ప్రచారం జరుగుతూండటంతో... తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. 


ఉపఎన్నికలు అంటే నగదు వరద పారుతుందన్న అభిప్రాయం !


మునుగోడులో ఉపఎన్నిక వస్తే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తారన్న కారణంగానే రాజీనామా చేశానని.. ప్రజలకు న్యాయం చేసేందుకేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకున్నారు. ఇలా చెప్పుకోవడానికి కారణం టీఆర్ఎస్సే. ఎక్కడ ఉపఎన్నిక జరిగితే అక్కడ వందల కోట్ల నిధులు పారించడం టీఆర్ఎస్ సర్కార్‌కు అలవాటు. దుబ్బాక నుంచి హుజూర్ నగర్ వరకూ జరిగింది అదే. హుజూర్ నగర్‌లో అయితే.. ప్రతి దళిత కుటుంబం ఇంటికి పది లక్షలు పంపిణీ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది.అయితే హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా చేసిన ఖర్చు.. టీఆర్ఎస్ అనధికారికంగా చేసిన ఖర్చు చూసిన వాళ్లంతా తమ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు వస్తే బాగుండని అనుకున్నారు. కొన్ని చోట్ల ప్రజలు ధర్నాలు కూడా చేశారు.  ఇప్పుడు అదే కారణం చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిరాజీనామా చేశారు. 


అప్పుడే టీఆర్ఎస్‌పై నెగెటివ్ ప్రచారం !


కోమటిరెడ్డి రాజీనామా చేస్తారని తెలియగానే..  టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఎప్పట్లాగే కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం.. సీఎంఆర్ఎఫ్ వంటి వాటిని విడుదల చేయడం చేస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్ని ఆమోదిస్తున్నారు. పది లక్షల పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే రెండున్నరేళ్ల నుంచి పట్టించుకోని ఉపాధి హమీ ఫీల్డ్ అసిసెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో బీజేపీ నేతలు..  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లనే ఇవన్నీ వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువగా ఉంది. ఇక నుంచి ప్రభుత్వం ఏ పథకం చేపట్టిన అదిరాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లనే వచ్చిందని బీజేపీ చెబుతుంది. ఇదిటీఆర్ఎస్‌ కుమేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. 


యంత్రాంగాన్ని మొత్తం దింపినా ఇబ్బందే !


హుజురాబాద్‌లో యంత్రాంగం మొత్తాన్ని కేసీఆర్ దించారు.  దీంతో ఒక్క ఈటలను ఎదుర్కోవడానికి ఇంత మందా అన్న అభిప్రాయం అక్కడి ఓటర్లలో ఏర్పడింది. చివరికి ఇది ఈటలపై సానుభూతి పెరగడానికి కారణం అయింది. అంతిమంగా ఈటలకు మేలు జరిగింది. నిజానికి ఓటర్ల సైకాలజీ చూస్తూ... అందరూ కలిసి ఒక్కరిపై దాడి చేస్తూంటే.. ఆ ఒక్కరి వైపే నిలబడతారు. అందుకే ఈ సారి మునుగోడు ఉపఎన్నిక విషయంలోనూ ఇలా యంత్రాంగం మొత్తాన్ని మోహిరంచాల్సిన పని లేదన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. అటుత నగదు వరద పారించినా.. కొత్త హామీలిచ్చినా...  పార్టీ యంత్రాంగాన్ని మొత్తం మోహరింపచేసినా ఇబ్బందేనన్న అభిప్రాయం ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు హైకమాండ్‌కు చేర్చారు. 


సరికొత్త ప్రణాళిక కావాలి !


విపరీతంగా ప్రభుత్వ పథకాలు అమలుచేసి.. నగదు వరద పారేలా చేస్తే..బీజేపీ ఇతర నియోజకవర్గాల్లోని ప్రజల తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేలా ఒత్తిడి చేయించే అవకాశం ఉంది. తమకు ఇలాంటి ప్లాన్ ఉందని బండి సంజయ్ చెప్పకనే చెప్పారు. అందుకే టీఆర్ఎస్ ఉపఎన్నికల వ్యూహం.. ఈ సారి డబ్బుతో ముడిపడి ఉండకూడదన్న అభిప్రాయం వినిపిస్తోంది.