TS BJP EC : తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సాలు దొర - సెలవు దొర అంటూ కేసీఆర్ పాలనపై ప్రచారానికి పెద్ద ఎత్తున చేయాలనుకున్న ప్రచారానికి అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి ప్రచారాలు చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. మీడియా కమిటీ వద్ద ఇందు కోసం తెలంగాణ బీజేపీ దరఖాస్తు చేసుకుంది. లు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఖరాఖండీగా ఎన్నికల కమిషన్ తెలిపింది.
" సాలు దొర - సెలవు దొర" ప్రచారాన్ని భారీగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్
" సాలు దొర - సెలవు దొర" క్యాంపెన్‌ను ఉద్యమంలా నిర్వహించాలని బీజేపీ అనుకుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 'సాలు దొర-సెలవు దొర'అనే డిజిటల్ బోర్డుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంట్ డౌన్ ను ప్రదర్శించారు. దాని రాజకీయ దుమారం రేగింది. దీంతో తాత్కాలికంగా ఆ బోర్డును బీజేపీ నిలిపివేసింది. అయితే అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసుకుంది. ఉద్యమ సమయంలో పాటలు, కళాకారులతో ఎలా పోరాటం సాగించారో అదే స్ఫూర్తితో రాష్ట్ర సర్కార్ పై పోరాటం సాగించేందుకు బీజేపీ ప్రణాళికలు వేసుకుంది. 'సాలుదొర-సెలవుదొర' పేరుతో వెబ్ సైట్ ప్రారంభించారు. సోషల్ మీడియా పేజీలను ప్రారంభించి...ప్రమోట్ చేస్తున్నారు.
ఈసీ అనుమతి నిరాకరణతో పేరు మార్చి నిర్వహించే అవకాశం
ఈసీ నిర్ణయం బీజేపీకి ఇబ్బందికరమే. ఒక్క స్లోగన్‌తో కేసీఆర్‌ను దొరగా ప్రోజెక్ట్ చేయవచ్చని అనుకున్నారు. ఇప్పుడు ఎన్నకిల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.టైటిల్‌ను మార్చి ఆ క్యాంపెన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. తెలంగాణలోని ప్రతీ ఒక్క గ్రామానికి కేసీఆర్ వైఫల్యాలు చేరే విధంగా సన్నాహాలు చేస్తోంది. అందులోభాగంగా కళాకారులతో వీడియోలు రూపొందిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై స్కిట్స్, పాటలను తయారుచేయిస్తోంది. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల హామీ మొదలు, నిరుద్యోగ భృతి, ఉచిత ఎరువులు, దళిత ముఖ్యమంత్రి, వరి వేస్తే ఉరి, చిన్నారులు, మహిళలపై జరుగుతన్న అత్యాచారాలు, రుణమాఫీ, అమరవీరుల త్యాగాలు ఇలా అన్నీ " సాలు దొర - సెలవు దొర" క్యాంపైన్ కిందే నిర్వహించాలనుకున్నారు.
మరోసారి ఈసీని సంప్రదించే అవకాశం
అయితే పేరుకు మాత్రమే ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపిందని బీజేపీ నేతలంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై వివిధ రూపాల్లో పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు అని గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ క్యాంపెన్‌కు కొత్త పేరు పెట్టి మళ్లీ రంగంలోకి దిగనున్నారు. అయితే ఈ విషయంలో ఈసీకి ఉన్న సందేహాలను నివృతి చేసి మరోసారి అనుమతి కోసం ప్రయత్నిచే అవకాశాలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీని తాము కించ పర్చడం లేదని వివరించి.. మీడియా కమిటీ అనుమతి తెచ్చుకోవాలని భావిస్తున్నారు.