ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలకు సంబంధించి పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతోందన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికలు రాగానే పార్టీలు పోటీ పడి మరీ ఉచిత పథకాలు ప్రకటించడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఒకరు విద్యుత్ ఛార్జీలు మాఫీ చేస్తామంటే.. మరొకరు ల్యాప్‌టాప్‌లు ఫ్రీగా ఇస్తామంటూ ఊదరగొడతారు. ఇలా పోటాపోటీగా హామీలు ఇస్తూ ఓట్లు దండుకుంటున్నారు. ఇలాంటి ఉచితాలు ప్రకటించే పార్టీల గుర్తింపు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఆగస్టు 3న విచారణ జరిగింది. ఇవాళ మరోసారి విచారణకు రానుందీ పిటిషన్.
ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు విచారణ
రాజకీయ పార్టీల ఉచిత పథకంపై సుప్రీంకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. రాజకీయ పార్టీల తరపున ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పే ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని ఆగస్టు 3న సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై నిషేధం విధించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని కూడా కోర్టు కోరింది. ఉచిత పథకాలపై దాఖలైన పిటిషన్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఉచితాలపై రచ్చ
ఎన్నికల సందర్భంగా పథకాలను ప్రకటించడం రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కు అని కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్‌ను వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రామన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. గత విచారణలో సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు పట్టుబట్టింది.
కమిటీ వేయాలని సుప్రీంకోర్టు కోరింది
కమిటీలో ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్, లా కమిషన్, రాజకీయ పార్టీలతోపాటు ఇతర పార్టీల ప్రతినిధులు ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉచిత పథకాలను నిలిపివేయడానికి సంబంధించి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్... కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పిటిషనర్ అయిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నుంచి సలహాలు ఆహ్వానించింది. దీని కోసం 7 రోజుల గడువు ఇచ్చింది. అది ముగిసిన తర్వాత నేడు విచారణ కొనసాగించనుంది.
ప్రధాని మోదీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం
ప్రజలను మభ్యపెట్టే వాగ్దానాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు సృష్టించే ఈ ఫ్రీబీల గురించి ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉచిత సౌకర్యాలు కల్పిస్తామన్న హామీలపై బుధవారం ఆయన మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం భవిష్యత్‌లో ఎవరైనా ఉచితంగా పెట్రోల్, డీజిల్ ఇస్తామని ప్రకటిస్తారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. కొంతమంది స్నేహితుల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తే పన్ను చెల్లింపుదారుడు మోసపోడా అని ప్రశ్నించారు. ఉచిత పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ప్రధానికి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.