Bengaluru Rave Party News: బెంగళూరులో ఓ రేవ్ పార్టీని అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) భగ్నం చేశారు. నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించినట్లుగా బెంగళూరు సీసీబీకి సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రేవ్ పార్టీలో భారీగా లిక్కర్ తో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా యువతీయువకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి చెందినది పోలీసులు గుర్తించారు. ఆయన గోపాల్‌ రెడ్డికి చెందినదని పోలీసుల విచారణలో తేలింది. 


రేవ్ పార్టీలో పోలీసులు మాదక ద్రవ్యాలను భారీగా గుర్తించారు. ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. ఈ రేవ్‌ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ పేరుతో పాస్‌ ఉన్న కారు కూడా గుర్తించినట్లు తెలిసింది. సీసీబీ సోదాల్లో ఎండీఎంఏ సహా పలు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిని సీసీబీ అదుపులోకి తీసుకుంది. అయితే, సినీ నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లుగా వదంతులు వచ్చాయి. దీనిపై ఆమె స్పష్టత ఇచ్చారు.


ఈ రేవ్ పార్టీలో దాదాపు 70 మంది యువకులు, 30 మంది వరకూ యువతులు పాల్గొన్నట్లు తెలిసింది. వారందరినీ అదుపులోకి తీసుకొని డ్రగ్స్ సేకరించిన వారిని గుర్తించడం కోసం మెడికల్ టెస్టులు చేయించారు. ఈ రేవ్ పార్టీ కోసం హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చి మరీ పలువురు హాజరైనట్లు తెలిసింది. 


నేను హైదరాబాద్ లోనే ఉన్నా - హేమ


‘‘నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ తెలిపారు.