CISF For Parliament Security: భారత పార్లమెంటు సమగ్ర భద్రత (Parliament Security) విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ భద్రత బాధ్యతలను ఇకపై సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) నిర్వహించనుంది. సీఐఎస్‌ఎఫ్‌‌కు చెందిన 3300 మందికిపైగా సిబ్బంది మే 20 తేదీ సోమవారం నుంచి విధులు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు సీఆర్పీఎఫ్‌ (CRPF)కు చెందిన పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌ (PDG), ఢిల్లీ పోలీసులు, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్‌ పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా భద్రత బాధ్యతలను నిర్వహించాయి.


అలజడి ఘటన కారణంగా..
2023 డిసెంబర్ 13న జీరో అవర్‌లో ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకడం కలకలం రేపింది.  ఈ సంఘటన తర్వాత, పార్లమెంట్ భద్రత, లోపాలు, సమస్యలను గుర్తించడానికి సీఆర్పీఎఫ్ డీజీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నివేదిక అనంతరం పార్లమెంట్ భద్రతను సీఐఎస్ఎఫ్‌కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పాత భద్రతా సిబ్బంది స్థానంలో 3317 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించనున్నారు. 


డీఐజీ ర్యాంకు స్థాయి సీఆర్పీఎఫ్‌ అధికారి శుక్రవారమే కాంప్లెక్స్‌లోని అన్ని సెక్యూరిటీ పాయింట్‌లను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఈ నేపథ్యంలో మే 20, సోమవారం ఉదయం 6 గంటల నుంచి సీఐఎస్‌ఎఫ్ పూర్తి బాధ్యతలు తీసుకోనుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని అన్ని ఫ్లాప్ ఎంట్రీ గేట్‌లు, కెనైన్ స్క్వాడ్‌లు, ఫైర్ టెండర్‌లతో పాటు అగ్నిమాపక సిబ్బంది, సీసీటీవీ మానిటరింగ్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్‌, వాచ్ టవర్ల వద్ద సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని నియమించింది. 


ప్రత్యేక డ్రస్ కోడ్
దీంతో ఇప్పటి వరకు ఉమ్మడిగా పార్లమెంట్‌కు భద్రత కల్పించిన సీఆర్‌పీఎఫ్ పీడీజీ, ఢిల్లీ పోలీసులు (సుమారు 150 మంది సిబ్బంది), పార్లమెంట్ భద్రతా సిబ్బంది (పీఎస్‌ఎస్) ఉపసంహరించుకున్నారని సీఐఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గత 10 రోజులుగా పార్లమెంట్ భవనాన్ని అధ్యయనం చేస్తున్నారని, రిసెప్షన్ ఏరియాల్లో ఉండే సిబ్బందికి సఫారీ సూట్‌లతో పాటు లేత నీలం రంగు ఫుల్ స్లీవ్ షర్టులు, బ్రౌన్ ప్యాంట్‌లను అందించినట్లు ఆయన చెప్పారు.


ప్రత్యేక శిక్షణ 
పార్లమెంటు కాంప్లెక్స్‌లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్‌, కమ్యూనికేషన్ సెంటర్‌, జాగిలాల స్క్వాడ్‌, వాచ్ టవర్‌ల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే వారికి సంబంధిత శిక్షణ అందజేశారు. విధ్వంసక కార్యకలాపాల కట్టడి తదితర విధులకు ప్రత్యేకంగా శిక్షణ పొందినవారిని రంగంలోకి దించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో భద్రత చర్యలు నిర్వహిస్తున్నారని, ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం వచ్చాక  పూర్తి స్థాయి అనుమతులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.  


బాధగా ఉంది..
పార్లమెంట్ భద్రత బాధ్యతలను నుంచి వైదొలగడంపై సీఆర్పీఎఫ్ అధికారి స్పందించారు. దేశంలోని అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేవాలయాన్ని 'సమర్థవంతంగా' కాపాడినందుకు గుర్తుగా సెల్ఫీలు దిగినట్లు తెలిపారు. 2001 ఉగ్రవాద దాడి సమయంలో ఇతర ఏజెన్సీల సిబ్బందితో కలిసి సీఆర్పీఎఫ్ సిబ్బంది అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని, ఉగ్ర దాడిని ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలను అర్పించారని, వారి ధైర్య సాహసాలకు గుర్తుగా శౌర్య పతకాలు అందుకున్నారని అన్నారు. ఉత్తమమైన సేవలను అందించినప్పటికీ పార్లమెంట్ భద్రత బాధ్యతల నుంచి వైదొలగడం బాధగా ఉందని అధికారి చెప్పారు.